జగన్ @ 365 నాటవుట్

ఇది జగన్ పాదయాత్రకు సంబంధించిన లేటెస్టు స్కోరు. ప్రజా సంకల్పయాత్రకు జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టి ఈరోజుకు 365 రోజులైంది. పోయిన ఏడాది నవంబర్ 6వ తేదీన ఇడుపులపాయలో పాదయాత్ర మొదలుపెట్టారు. చంద్రబాబునాయుడు ప్రజావ్యతిరేక పాలనను నిరసిస్తు జగన్ మొదలుపెట్టిన పాదయాత్ర అప్రతిహతంగా పోయిన నెల 25వ తేదీ వరకూ నిరాఘాటంగా సాగింది. హైదరాబాద్ కు రావటానికి పోయిన నెల 25వ తేదీన జగన్ విశాఖపట్నం విమానాశ్రయంలో వెయిట్ చేస్తున్నపుడు ఓ యువకుడు సెల్ఫీ పేరుతో దగ్గరై కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే.

కత్తిపోటు దెబ్బకు గాయపడిన జగన్ ను డాక్టర్లు మూడు వారాల విశ్రాంతి అవసరమని సూచించటంతో పాదయాత్రకు బ్రేక్ పడింది. పాదయాత్ర మొదలుపెట్టిన 365 రోజుల్లో అనారోగ్యం కారణంతో బ్రేక్ పడటం ఇదే మొదలు. పాదయాత్ర సమయంలో వానొచ్చినా, జ్వరమొచ్చినా, జలుబు ఇన్ఫెక్షన్ లాంటివి సోకినా పాదయాత్రను మాత్రం ఆపలేదు. చివరకు అరికాళ్ళకు బొబ్బలెక్కినా కూడా లెక్క చేయకుండా పాదాయాత్రను కంటిన్యూ చేసిన విషయం తెలిసిందే. ప్రజాసమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవటమే కాకుండా జనాలను నేరుగా కలుసుకుని మాట్లాడాలన్న ఉద్దేశ్యంతో ఓ నేత 3211 కిలోమీటర్లు నడవటం దేశ రాజకీయ చరిత్రలో ఇదే మొదటిసారేమో ?

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం ఇడుపులపాయలో మొదలైన పాదయాత్ర పిల్ల కాలువలాగ మొదలై జిల్లా దాటి కర్నూలు జిల్లాలోకి అడుగుపెట్టేటప్పటికి కాలువంతైంది. కర్నూలు దాటి అనంతపురం, తర్వాత చిత్తూరులోకి ప్రవేశించేనాటికి ఏరులాగ మారింది. రాయలసీమ జిల్లాల ముగించుకుని కోస్తా జిల్లా నెల్లూరులోకి ప్రవేశించగానే పాదయాత్ర పెద్ద ఏరులాగ కనిపించింది. అక్కడి నుండి ప్రకాశం జిల్లా దాటి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోకి ప్రవేశించిన తర్వాత నదిలాగ మారింది.


కృష్ణాజిల్లాలో నదిలాగ కనిపించిన పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత జీవనదిలాగ తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశించే నాటికి సముద్రంలాగ మారింది. ఇక అక్కడి నుండి ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో సాగుతున్న పాదయాత్ర నిజంగా జనసముద్రాన్నే తలపిస్తోంది. ఎక్కడికక్కడ జనాలు జగన్ కు బ్రహ్మరధం పడుతున్న విషయం అర్ధమైపోతోంది.

చంద్రబాబునాయుడు అండ్ కో పైకి పాదయాత్రను ఎంత తక్కువ చేసి మాట్లాడుతున్నా లోలోపల వారిలో టెన్షన్ కనిపిస్తూనే ఉంది. ఎందుకంటే, పోయిన ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాలు కావచ్చు లేదా ఉత్తరాంధ్ర కావచ్చు వైసిపిని పెద్దగా ఆధరించలేదన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ప్రస్తుతం పాదయాత్రలో జగన్ కు అనుకూలంగా స్పందిస్తున్న జనాలను చూసిన తర్వాత టిడిపిలో టెన్షన్ మొదలైందన్నది మాత్రం వాస్తవం. ప్రతిపక్ష నేత పాదయాత్రకు జనాలు ఎందుకింతలా స్పందిస్తున్నారంటే చంద్రబాబు పాలనపై ఉన్న వ్యతిరేకతతోనే అన్నది స్పష్టమవుతోంది.

365 రోజుల్లో జగన్ 3211 కిలోమీటర్లు నడిచారు. 122 నియోజకవర్గాల్లోని 205 మండలాల్లో పాదయాత్ర సాగింది. 1739 గ్రామాలు, 47 మున్సిపాలిటీలను టచ్ చేశారు. 8 కార్పొరేషన్లలో కూడా నడిచారు. మొత్తం మీద 113 సభలు, 42 ఆత్మీయ సమ్మేళనాల్లో మాట్లాడారు. పాదయాత్రలో ఎక్కడికక్కడ లోకల్ సమస్యలపైనే జగన్ ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఆయ జిల్లాలోని మంత్రులు, టిడిపి ప్రజాప్రతినిధుల అక్రమలు, అవినీతిని ప్రధానంగా ఎత్తి చూపుదున్నిరు. ఎప్పుడైతే స్ధానికంగా అపరష్కృతంగా ఉన్న సమస్యలు, టిడిపి నేతల అవినీతిని ఎత్తి చూపుతున్నారో సహజంగానే స్దానికుల నుండి పెద్ద ఎత్తున స్పందన కనిపిస్తోంది.

పాదయాత్రలో బ్యాలెన్సుంది ఇక శ్రీకాకుళం జిల్లా మాత్రమే. విజయనగరంలో మిగిలిపోయిన నియోజకవర్గాలతో పాటు శ్రీకాకుళంలో అడుగుపెడితే పాదయాత్ర పూర్తయినట్లే. కత్తొపోటుకు గురికాకుండా ఉండుంటే బహుశా ఈపాటికి విజయనగరం జిల్లా అయిపోయేదేమో. శ్రీకాకుళం జిల్లాలో సుమారు 130 కిలోమీటర్ల యాత్ర బ్యలెన్సుంది. ఈనెల 3వ వారంలో పాదయాత్రను తిరిగి మొదలుపెట్టినా డిసెంబర్ నెల 3వ వారానికి పాదయాత్ర పూర్తయ్యే అవకాశాలున్నాయి. మొత్తానికి దేశరాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి ఓ చరిత్రను సృష్టించారనే చెప్పాలి.