వైఎస్ అవినాశ్ రెడ్డి అరెస్టు అట.! మళ్ళీ కొత్త ఆట.!

కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి సీబీఐ మళ్ళీ నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం 11 గంటలకు హాజరు కావాల్సింది సీబీఐ ఆ నోటీసుల్లో పేర్కొంది. మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ నిమిత్తం సీబీఐ యెదుట ఇప్పటికే పలుమార్లు అవినాశ్ రెడ్డి విచాణకు హాజరైన సంగతి తెలిసిందే.

కొద్ది రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ అవినాశ్ రెడ్డిని సీబీఐ విచారణకు పిలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రేపు అవినాశ్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేయడం ఖాయమంటూ టీడీపీ అనుకూల మీడియాలో ప్రచారం జరుగుతోంది.

కాగా, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య 2019 ఎన్నికల సమయంలో జరగ్గా, చంద్రబాబు కుట్రపూరితంగా హత్య చేయించారని అప్పట్లో వైసీపీ ఆరోపించింది. అప్పట్లో వైసీపీ నేతగా వున్నారు వివేకానంద రెడ్డి. అయితే, అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న సమయంలో వైసీపీ మాట మార్చింది.

కుటుంబ తగాదాల వల్ల వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిందనీ, మతం మార్చుకుని వైఎస్ వివేకానంద రెడ్డి మరో పెళ్ళి చేసుకున్నారనీ, అదే ఆయన హత్యకు కారణమని వైసీపీ ఆరోపించడం మొదలు పెట్టింది. ప్రధానంగా వివేకానంద రెడ్డి కుమార్తె, అల్లుడి మీద వైసీపీ ఆరోపణల తీవ్రతను పెంచింది.

ఈ నేపథ్యంలో ఈ కేసు కొత్త మలుపు తిరిగినట్లయ్యింది. మరోపక్క, అరెస్టు నుంచి తప్పించుకునేందుకు వైఎస్ అవినాశ్ రెడ్డి చాలా ప్రయత్నాలు చేశారు. కొంతమేర సఫలమయినా, ముందస్తు బెయిల్ వచ్చినట్టే వచ్చి.. కొన్ని రోజుల తర్వాత రద్దయ్యింది.

దాంతో, అవినాశ్ రెడ్డి అరెస్టవుతారా.? లేదా.? అన్నది ఉత్కంఠగా మారిందిప్పుడు.