అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం వైసిపి ఎంఎల్ఏగా తిప్పేస్వామి ప్రమాణస్వీకారం చేశారు. స్పీకర్ కోడెల శివప్రసాద్ కార్యాలయంలో తిప్పేస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమం సింపుల్ గా జరిగిపోయింది. అసలు తిప్పేస్వామి ఎంఎల్ఏగా నాలుగున్నరేళ్ళ క్రితమే ప్రమాణస్వీకారం చేయాల్సింది. కాకపోతే న్యాయ, శాసనవ్యవస్దల్లోని లోపాల కారణంగా ఎన్నికలు తరుముకొస్తున్న సమయంలో ఎంఎల్ఏ అయ్యారు. 2014 ఎన్నికల్లో వైసిపి అభ్యర్ధిగా తిప్పేస్వామి పోటీచేయగా టిడిపి తరపున ఈరన్న పోటీలో నిలిచారు. ఆ ఎన్నికల్లో ఈరన్న గెలిచారు.
అయితే, ఈరన్న దాఖలు చేసిన ఎన్నకల అఫిడవిట్ లో క్రిమినల్ కేసుల విషయం దాచిపెట్టారంటూ తిప్పేస్వామి ఫిర్యాదు చేసినా ఉపయోగం లేకపోయింది. ఈరన్నపై కర్నాటకలో రెండు ఏపిలో ఒక క్రిమినల్ కేసు విచారణలో ఉంది. ఎన్నకల నిబంధనల ప్రకారం క్రిమినల్ కేసుల వివరాలను అఫిడవిట్ లో చెప్పకపోవటం నిరమే అవుతుంది. ఆ విషయంపై తప్పేస్వామి ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోలేదు. దాంతో తిప్పేస్వామి కోర్టులో కేసు వేశారు. ఆ కేసు పర్యవసానం వల్లే టిడిపి ఎంఎల్ఏలగా నాలుగున్నరేళ్ళు ఎంజాయ్ చేసిన ఈరన్న ఈనెలలో రాజీనామా చేయాల్సొచ్చింది.
ఎంఎల్ఏగా ఈరన్న అనర్హుడని అందరికీ తెలుసు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. అందుకు తెరవెనుక జరిగిన మంత్రాంగమే కారణమని వేరేగా చెప్పక్కర్లేదు. అయితే తిప్పేస్వామి పట్టువదలకుండా కేసుపై నాలుగున్నరేళ్ళు పోరాటం చేయటమంటే మామూలు విషయం కాదు. సరే ఏదేమైనా మొత్తానికి తిప్పేస్వామి గెలిచారు. తిప్పేస్వామి ఫిర్యాదు చేయగానే అప్పటి రిటర్నింగ్ అధికారి సక్రమంగా స్పందిచుంటే అప్పట్లోనే తిప్పేస్వామి ఎంఎల్ఏ అయ్యుడేవారు. మొత్తానికి బుధవారం స్పీకర్ కార్యాలయంలో తిప్పేస్వామి ఎంఎల్ఏగా ప్రమాణ స్వీకారం చేశారు. ఐదు నెలల్లో షెడ్యూల్ ఎన్నికలొస్తున్న సమయంలో తిప్పేస్వామి ఎంఎల్ఏగా ప్రమాణస్వీకారం చేయటం శుభ సూచకంగా వైసిపి భావిస్తోంది.