జగన్ నిర్ణయంపై వైసీపీ నేత అప్పిరెడ్డి అనూహ్య స్పందన

వైసిపి నేతలు భయపడినట్టే జరుగుతోంది. జగన్ అసంతృప్తిగా ఉన్న నేతలపై వేటు వేస్తున్నారు. గెలుస్తారు అని బలంగా నమ్మినవారికే సీట్లు కేటాయిస్తున్నారు. దీనికోసం ఎప్పటి నుండో పార్టీలో ఉన్న నేతలను కూడా హర్ట్ చేస్తున్నారు. గెలుపే ధ్యేయంగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. వంగవీటి రాధాకు సెంట్రల్ సీటు కేటాయించకపోవటంపై పెద్ద చర్చ నడిచింది. పార్టీలో ముందు నుండి ఉన్న రాధాను పక్కన పెట్టి జగన్ ఆ సీటును మల్లాది విష్ణుకి కేటాయించారు. ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పుడు అదే తరహాలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం సీటుపై వైసీపీలో పోరు నడుస్తోంది.

ఆ సీటుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు లేళ్ల అప్పిరెడ్డి. అయితే ఆయనను కాదని జగన్ కొత్తగా పార్టీలో చేరిన రిటైర్డ్ డిఐజి చంద్రగిరి ఏసురత్నం ను పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. దీంతో లేళ్ల వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేసింది. కాగా జగన్ నిర్ణయంపై స్పందించారు వైసిపి నేత లేళ్ల అప్పిరెడ్డి. ఆయన ఏం మాట్లాడారో కింద ఉంది చదవండి.

“నాకు పదవులు ముఖ్యం కాదని, నా బలగం, బలం అంతా అభిమానులేనని అప్పిరెడ్డి వెల్లడించారు. కొత్తగా పార్టీలో చేరిన వారికి న్యాయం చేయాలి అని జగన్ భావిస్తున్నారు. కానీ ఆ నిర్ణయాలతో ఎప్పటి నుండో పార్టీని నమ్ముకున్న నేతలకు అసంతృప్తి ఎదురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ పెద్దలతో వ్యక్తిగతంగా మాట్లాడతానని తెలిపారు. అభిమానులు తొందరపడొద్దని, మీ అభిప్రాయం మేరకే నడుచుకుంటానని” అభిమానులను ఉద్దేశించి చెప్పారు.

నిజానికి అప్పిరెడ్డి పార్టీ కోసం చాల కష్టపడ్డారు అనేది గుంటూరు వైసిపి అభిమానుల్లోను, అప్పిరెడ్డి అనుచరుల్లోనూ వినిపించే మాట. ఆయనపై పలు కంప్లయింట్లు ఉన్నప్పటికీ పార్టీ వ్యవహారాలు చాకచక్యంగా నిర్వర్తిస్తుంటారు అంటుంటారు. అందునా ఎప్పటి నుండో పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తిని పక్కనబెట్టడంపై ఆయన అనుచరుల్లో తీవ్ర ఆగ్రహం నెలకొంది. విలువ లేనప్పుడు పార్టీలో నుండి వచెయ్యమంటూ అభిమానులు ఆయనపై ఒత్తిడి తెస్తున్నారు. కానీ అప్పిరెడ్డి మాత్రం తొందరపడి నిర్ణయం తీసుకోకుండా పార్టీ పెద్దలతో చర్చలు జరిపి ఫలించకపోతే అభిమానుల నిర్ణయం మేరకు భవిష్యత్తు కార్యాచరణ జరుపుతానని వెల్లడించారు.

ఇదిలా ఉండగా సీట్ల కేటాయింపు విషయంలో మాత్రం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. పార్టీ నేతలను ఆ నిర్ణయాలు బాధించినప్పటికీ ఆయన కఠినంగానే వ్యవహరిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఇప్పటి వరకు కొన్ని నియోజకవర్గాల్లో జగన్ చేసిన అభ్యర్థుల మార్పులు చేర్పులు చూస్తే తెలుస్తోంది.

విజయవాడ సెంట్రల్ సీటు రాధాకి కాకుండా మల్లాది విష్ణుకి ఇచ్చారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం సమన్వయకర్తగా ఆనం రామనారాయణరెడ్డిని నియమించి బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిని దూరం చేసుకున్నారు. గుంటూరు చిలకలూరిపేట నియోజకవర్గంలో మర్రి రాజశేఖర్ ఉండగా కొత్తగా వచ్చిన రజిని విడదల ను పార్టీ సమన్వయకర్తగా నియమించారు. ఇప్పుడు లేళ్ల అప్పిరెడ్డి ఆశలు పెట్టుకున్న గుంటూరు పశ్చిమ నియోజక వర్గం సమన్వయకర్తగా నియమించారు. అదే జిల్లాలో గుంటూరు లోక్ సభ సీటు తనదే అన్న ధీమాతో ఉన్న లావు శ్రీకృష్ణ దేవరాయలను నరసరావుపేట ఎంపీ స్థానానికి ఫిక్స్ చేశారు.

అయితే అభ్యర్థుల ఎంపికలో జగన్ కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అవి పార్టీ శ్రేయస్సుకే అని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. సీట్ల విషయంలో అసంతృప్తి చెందకుండా పార్టీ గెలుపు కోసం త్యాగాలు చేయాల్సి వస్తుందని నేతలకు సూచిస్తున్నారు. పార్టీ గెలుపు కోసం సమిష్టిగా పోరాడాలంటూ పిలుపునిస్తున్నారు. సర్వేలో ఓడిపోతారని తెలిస్తే నాకు కూడా సీటు ఇవ్వరు అంటూ వైసిపి నేత కొలుసు పార్ధసారధి లాంటివారు బహిరంగంగానే తెలిపారు.