వివేకా హత్యపై సిబిఐ విచారణకు డిమాండ్..ఏడు కత్తిపోట్లు

మాజీ మంత్రి, వైఎస్సార్ సోదరుడు, జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వివేకానందరెడ్డి మృతిపై రాష్ట్రప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది. అయితే, వివేకా మృతి మిస్టరీలో వాస్తవాలు బయటకు రావాలంటే సిబిఐ విచారణే వేయాలంటూ వైసిపి డిమాండ్ చేస్తోంది.  ప్రస్తుతం వివేకా జమ్మలమడుగు నియోజకవర్గంలో పార్టీ ఇన్చార్జిగా ఉన్నారు. గురువారం మొత్తం జమ్మలమడుగులోనే ప్రచారం చేసి రాత్రి పొద్దుపోయిన తర్వాత సుమారు 11 గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకున్నారు.

రాత్రి పడుకున్న వివేకా ఉదయానికల్లా దెబ్బలతో రక్తపుమడుగులో పడిఉండటం నిజంగా అందరికీ షాకే. మొదట గుండెపోటుతో మరణించారనే అందరూ అనుకున్నారు. తర్వాతే తల, మొహం, చేతులు, వేళ్ళపై బలమైన గాయాలుండటంతో అందరికీ వివేకాది సహజమరణం కాదని అర్ధమైపోయింది. ఆ అనుమానంతోనే వివేకా పిఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగారు.

ఉదయం వివేకా మృతివార్త తెలిసినపుడు టిడిపి నేతలెవరూ స్పందించలేదు. ఎప్పుడైతే మరణంలో మిస్టరీ ఉందని తేలిందో వెంటనే ఒక్కొక్కళ్ళు నోరిప్పటం మొదలుపెట్టారు. వివేకా మరణం వెనకున్న మిస్టరీని ఛేదించాలంటూ మంత్రి ఆదినారాయణరెడ్డి, రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ డిమాండ్ చేయటం విచిత్రంగా ఉంది. ప్రభుత్వంలో ఉన్నదే వాళ్ళయినపుడు వాళ్ళ ఇంకెవరిని డిమాండ్ చేస్తారు ? మొత్తానికి వివేకా మృతివల్ల లాభపడే వాళ్ళే హత్యచేసుంటారంటూ వైసిపి నేతలు ఆరోపణలు మొదలుపెట్టటం గమనార్హం. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాల్సిందే