ఆంధ్రా మంత్రివర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రిగా ఉన్న వ్యక్తి యనమల రామకృష్ణుడు. ఆయన పంటి వైద్యం ఫారెన్ లో చేయించుకున్నారు. ఆ ఖర్చు సర్కారు వారి ఖజానా నుంచే చెల్లించారు. మరి మంత్రి యనమల పంటి వైద్యం ముచ్చటేంది? ఎంత ఖర్చయింది? ఖజానా నుంచే ఎందుకిచ్చారు? పూర్తి వివరాల కోసం స్టోరీ చదవండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ, శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు గత నాలుగు నెలల క్రితం సింగపూర్ పర్యటనకు వెళ్లారు. 12, ఏప్రిల్ 2018లో ఆయన సింగపూర్ లో ఉన్నారు. పెట్టుబడుల సమీకరణ కోసం ఆయన సింగపూర్ లో పర్యటించారు. పెట్టుబడులు ఏమేరకు ఆకర్షించారో తెలియదు కానీ ఆయన మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా ధనం మాత్రం మంచిగానే ఖర్చు పెట్టేశారు. రూట్ కెనాల్ ట్రీట్ మెంట్ ఏ మంత ఎమర్జన్సీ వ్యవహారం కాదు. ఇండియాకు వచ్చి చేయించుకోవచ్చు. అయినా సరే ఆయన సింగపూర్ లోనే చేయించుకోవడం చర్చనీయాంశమయింది. సాధారణంగా విదేశాలలో ఉండే వాళ్ల అక్కడ ఖర్చుకు భయపడి పంటి చికిత్సకోసం ఇండియాకు వస్తుంటారని కాంగ్రెస్ నేతలంటున్నారు. ఇది ప్రజానిధుల దుర్వినియోగమేనని ఆంధ్రా కాంగ్రెస్ నేత కొలనుకొండ శివాజీ వ్యాఖ్యానించారు.
సింగపూర్ పర్యటనలో ఉన్న సమయంలో మంత్రి యనమలకు పంటి నొప్పి బాధించింది. దీంతో తట్టుకోలేక ఆయన అక్కడి ఆసుపత్రిలో దంతాలకు రూట్ కెనాల్ చేయించుకున్నారు. దానికి అయిన ఖర్చు ఎంతంటే… 2,88,823 మాత్రమే. దంతాలకు రూట్ కెనాల్ చేయిస్తే అంత ఖర్చవుతుందా అని నోరెళ్ల బెట్టాల్సిన పనిలేదు. ఎందుకంటే అదేమైనా తెలుగు రాష్ట్రాల్లోని దంతాల దావఖానా అనుకున్నారా? సింగపూర్ లోని రిచ్ ఆసుపత్రి. ‘అజురే డెంటల్’’ అనే సింగపూర్ ఆసుపత్రిలో కదా ఆమాత్రం ఖర్చు కాకుండా ఎలా ఉంటుంది.
సరే పెట్టుబడులు సమీకరించేందుకు వెళ్లి పంటి వైద్యం చేయించుకున్నారు సరే. కానీ ఆ సొమ్ము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా నుంచి చెల్లించాలంటూ మంత్రి ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు మంత్రి యనమల అధికారిక పర్యటనలో భాగంగా సింగపూర్ వెళ్లారు కాబట్టి, ఆయనకు అప్పుడు పంటినొప్పి బాధించింది కాబట్టి ఆ నొప్పి కి అయిన వైద్యానికి ప్రజా ధనం వెచ్చిచేందుకు ఎపి సర్కారు అనుమతి మంజూరు చేసింది. యనమల పెట్టిన రిక్వెస్ట్ ను అంగీకరించింది. ఈమేరకు గురువారం ఎపి సర్కారు ప్రత్యేక జిఓ విడుదల చేసింది. మంత్రి యనమల వైద్యానికి అయిన ఖర్చును ఖజానా నుంచి చెల్లించింది.
యనమల పంటి వైద్యం విషయంలో ఆంధ్రాలో విపక్ష పార్టీల నుంచి విమర్శలు గుప్పుమంటున్నాయి. విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చేందుకు వెళ్లి రాష్ట్ర జనాల సొమ్మును ఖర్చు చేయడమేంటని ప్రశ్నిస్తున్నాయి. ఒకవేళ పంటి వైద్యం అక్కడే చేయించుకున్నా.. జనాల సొమ్ము ఎందుకు ఖర్చు చేస్తారని ప్రశ్నిస్తున్నాయి. ప్రపంచమంతా పంటి వైద్యం కోసం ఇండియాకు చక్కర్లు కొడుతుంటే యనమల మాత్రం సింగపూర్ లో పంటి వైద్యం చేయించుకోవడం ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు రాజకీయ పండితులు.
ఆయన సొంత ఖర్చుతో సింగపూర్ లో నే కాదు ఇంకే దేశంలోనైనా పంటి వైద్యం చేయించుకుంటే తమకు అభ్యంతరం లేదు కానీ, ఇలా జనాల సొమ్మును మంచినీళ్లలా ఖర్చు చేయడం ఏమాత్రం సమంజసం కాదని గుంటూరు జిల్లాకు చెందిన వైసిపి నేత మండిపడ్డారు. చీమ కుట్టినా చంద్రబాబు సింగపూర్ వెళ్లున్న రోజుల్లో యనమల కూడా దంతాలకు రూట్ కెనాల్ సింగపూర్ లో చేయించుకోవడంలో మతలబు ఏంటో అని ఆయన ప్రశ్నించారు.
మొత్తానికి యనమల పంటి వైద్యంతో జనాల జేబులకు చిల్లు పడిందని అంటున్నారు ఆంధ్రా వాళ్లు.