మహాకూటమి పై యాదవ నేతల తిరుగుబాటు

మహాకూటమి పై యాదవ నేతల తిరుగుబాటు బావుటా ఎగుర వేసినట్టు తెలుస్తోంది. మరి కాసేపట్లో సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో యాదవ నేతలు భిక్షపతి యాదవ్, తోటకూరి జంగయ్య యాదవ్, క్యామ మల్లేష్, బొల్లం మల్లయ్య యాదవ్ లు ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఈ సమావేశంలో కూటమి తీరు పై వారు సంచలన నిజాలు వెల్లడిస్తారని తెలుస్తోంది.

కూటమిలో సీట్ల సర్దుబాటులో భాగంగా యాదవ సామాజిక వర్గాలకు టికెట్లు కేటాయిస్తామని చెప్పి అన్ని సీట్లు కూడా రెడ్డిలకే కేటాయించారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీల కోసం అహర్నిషలు శ్రమిస్తే చివరికి ఎవరికో సీట్ల కేటాయింపు చేశారని వారు గుర్రుగా ఉన్నారు. అది ప్రజా కూటమా లేక రెడ్డి కూటమా అని వారు విమర్శించారు. కూటమిలో ముషీరాబాద్ నుంచి అనిల్ కుమార్ యాదవ్ ఒక్కరికే సీటు కేటాయించారని మిగిలిన నేతలను అసలు పట్టించుకోలేదని వారు గుస్సగా ఉన్నారు.  

బొల్లం మల్లయ్య యాదవ్

మరో వైపు యాదవ నేతల నిర్ణయం కూటమిని ఇరకాటంలో పెట్టే విధంగా ఉంది. టిఆర్ఎస్ పార్టీ ఐదుగురు యాదవ నేతలకు టికెట్టివ్వగా కూటమి నుంచి మాత్రం  ఒక్క టికెటే లభించింది. ఈ నేపథ్యంలో వీరంత కూడా స్వతంత్ర అభ్యర్ధులుగా నామినేషన్ వేయనున్నారని తెలుస్తోంది.

టిఆర్ఎస్ కేటాయించిన 5 స్థానాలు ఇవే

సనత్ నగర్- తలసాని శ్రీనివాస్ యాదవ్

నాగార్జున సాగర్- నోముల నర్సింహ్మయ్య

షాద్ నగర్-  అంజయ్య యాదవ్

కల్వకుర్తి- జైపాల్ యాదవ్

మలక్ పేట- సతీష్ కుమార్ యాదవ్

మహా కూటమి నుంచి 

ముషీరాబాద్- అనిల్ కుమార్ యాదవ్

భిక్షపతి యాదవ్ శేరిలింగంపల్లి నుంచి తనకు కాంగ్రెస్ టికెట్ కేటాయించాలని ఆందోళన నిర్వహించారు. పార్టీ అధికారంలో లేకపోయినా కూడా క్యాడర్ ను కాపాడుకుంటూ వచ్చానని తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరినా కూడా కాంగ్రెస్ ఆయన వినతిని పరిగణలోకి తీసుకోకుండా అక్కడ టిడిపికి చెందిన భవ్య ఆనంద్ ప్రసాద్ కు కేటాయించింది.

రంగారెడ్డి జిల్లా డిసిసికి సుధీర్ఘ కాలం అధ్యక్షునిగా పని చేసిన క్యామ మల్లేష్ కూడా ఇబ్రహీంపట్నం టికెట్ కేటాయించాలని కోరగా అధిష్టానం పట్టించుకోలేదు. క్యామ మల్లేష్ వైఎస్ కు చాలా సన్నిహితుడు. అప్పట్లో పదవులు తీసుకోకుండా పార్టీకి పని చేశారు. ఇప్పుడు ఓ సారి అవకాశం ఇవ్వమంటే కాంగ్రెస్ అవకాశం ఇవ్వలేదు.

కోదాడ టిడిపి సీనియర్ నేత, పట్టున్న నేత బొల్లం మల్లయ్య యాదవ్. ఆయనకు టిడిపి టికెట్ కేటాయించలేదు. ఈ మూడు స్థానాలు కూడా కూటమి పొత్తులో భాగంగా కాంగ్రెస్ నుంచి టిడిపికి, టిడిపివి కాంగ్రెస్ కు వెళ్లాయి. మరో వైపు ఈ రోజు సాయంత్ర కేసీఆర్ తనతో సమావేశం కావాలని మల్లయ్య యాదవ్ కు సమాచారమిచ్చారు. కోదాడ టిఆర్ఎస్ టికెట్ మల్లయ్య యాదవ్ కు వస్తుందా అనే చర్చ జరుగుతోంది.