2014 ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనకుండా ఎమ్మెల్సీ అయిపోయిన నారా లోకేష్ మంత్రి పదవి పోందేసి దర్జాగా అధికారం అనుభవించారు. సరే ఊరకనే మంత్రి అయినా లోకేష్ ప్రత్యక్ష ఎన్నికలకు సన్నద్దమయ్యారా అంటే లేదు. ఫలితంగా 2019 ఎన్నికల్లో మంగళగిరి నుండి పోటీలోకి దిగి ఓటమిపాలయ్యారు. మంగళగిరిలో టీడీపీకి సరైన ట్రాక్ రికార్డ్ లేకపోయినా అక్కడి నుండే లోకేష్ బాబును పోటీకి నిలిపారు ఆయన. రాజధాని ప్రాంతం మంగళగిరిలోనే ఉంటుందని చెప్పుకుని గెలవాలని భావించారు. కానీ జనం పెద్దగా నమ్మలేదు. ఫలితంగా లోకేష్ ఓటమిపాలయ్యారు. వైసీపీ నుండి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గెలుపొందారు. దీంతో చంద్రబాబు నిర్ణయాన్ని అందరూ తప్పుబట్టారు. చేతులారా కుమారుడ్ని ఓడిపోయేలా చేశారని అన్నారు.
కానీ ఇప్పుడు మాత్రం ఆయన నిర్ణయమే సరైందని అంటున్నారు. ఈసారి ఎన్నికల్లో మాత్రం లోకేష్ గెలిచే వాతావరణం కనిపిస్తోందని అంటున్నారు. ఎందుకంటే గత ఎన్నికల్లో గెలిచిన ఆర్కే పెద్దగా చేస్తున్నదేమీ లేదు. పార్టీలో, ప్రభుత్వంలో ఆయన ప్రాముఖ్యత పెద్దగా లేదు. పైగా ఈ ప్రాంతం మీద రాజధాని ప్రభావం గట్టిగానే ఉంది. వైఎస్ జగన్ సీఎం అయ్యాక రాజధానిని మూడు ముక్కలు చేస్తానని అన్నారు. దీంతో అమరావతి ప్రాముఖ్యత పడిపోయింది. అక్కడ భూములిచ్చిన రైతుల జీవితాలు తలకిందులయ్యాయి. రాజధాని పక్కనే ఉండటం మూలంగా ఇన్నాళ్లు మంగళగిరికి ప్రాముఖ్యత ఉండేది. కానీ ఇప్పుడది పోయింది.
రాజధాని మూలంగా వచ్చే అన్ని ప్రయోజనాలు ఆ ప్రాంతం నుండి పోయాయి. దీంతో వైసీపీ మీద ఆ ప్రాంతం జనం గుర్రుగా ఉన్నారు. ఈ ఊపులోనే లోకేష్ గెలుపు అవకాశాలు బాగా పెరిగాయట. ఈసారికి మంగళగిరి ఓటర్లు వైసీపీని నమ్మే పరిస్థితిన ఉండదని, రైతుల ప్రభావం గట్టిగా కనబడుతుందని ఫలితంగా టీడీపీ గెలుస్తుందని అంటున్నారు. పైగా లోకేష్ ఓడిపోయినా నియోజకవర్గ ఇంఛార్జుగానే కొనసాగుతూ పార్టీ కార్యక్రమాలను చూసుకుంటున్నారు. ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన అందుబాటులో లేకపోయినా ఆయన అనుచరులు నిత్యం మంగళగిరిలో యాక్టివ్ గా ఉన్నారట. ఈ కారణాలన్నీ కలిసి ఈసారి లోకేష్ ఎమ్మెల్యే కావడం ఖాయమంటున్నారు.