ఆ జిల్లాలో వైసిపికి 8 సీట్లు గ్యారెంటీ అట

అవును జిల్లాలో పరిస్ధితి చూస్తుంటే అందిరికీ అదే అభిప్రాయం కలుగుతోంది. ఇంతకీ ఆ జిల్లా ఏమిటనుకుంటున్నారా ? అనంతపురం జిల్లా. తాజాగా ఎంఎల్ఏగా నియమితులైన వైసిపి ఎంఎల్ఏ తిప్పేస్వామి చెబుతున్న జోస్యం ఇది. పోయిన ఎన్నికల్లో ఇదే జిల్లాను తెలుగుదేశంపార్టీ దాదాపుగా క్లీన్ స్వీప్ చేసేసింది. పోయిన ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రావటంలో కీలక పాత్ర పోషించిన జిల్లాల్లో అనంతపురం జిల్లా కూడా ఒకటి. జిల్లాలోని 14 సీట్లలో టిడిపికి ఏకపక్షంగా 12 సీట్లు వచ్చాయి. అంటే వార్ దాదాపు వన్ సైడ్ అయినట్లే లెక్క. అటువంటి జిల్లాలో టిడిపి పరిస్దితి దాదాపు తల్లక్రిందులైపోయినట్లే  కనిపిస్తోంది. అంటే ఆ విషయాన్ని టిడిపి నేతలే బాహాటంగానే చెబుతున్నారు కదా ?

 

అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డి అయితే, జిల్లాలో పార్టీ పరిస్దితేమీ బావోలేదని ఎన్నిసార్లు చెప్పుంటారో ? ఎంఎల్ఏలపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందని, ఎంఎల్ఏ అభ్యర్ధులను  మార్చకపోతే కనీసం పది సీట్లలో టిడిపి ఓపోవటం ఖాయమని నేరుగా చంద్రబాబునాయుడుతోనే చెప్పారు. అదే సమయంలో ఈమధ్యనే జిల్లాలో రెండు రోజుల పాటు క్యాంపు వేసిన చంద్రబాబు కూడా జిల్లాలో పార్టీ పరిస్ధితి ఏమీ బావోలేదని మండిపడిన విషయం అందరికీ తెలిసిందే. ఐదు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్దితి బాగా దారుణంగా ఉందని చంద్రబాబుకే అర్ధమైపోయింది.

 

జిల్లాలోని కదిరి, మడకశిర, గుత్తి, రాయదుర్గం, పుట్టపర్తి, శింగనమల, కల్యాణదుర్గం, హిందుపురం, పెనుకొండలో పార్టీ పరిస్దితి ఏమాత్రం బావోలేదట. అనంతపురం, ధర్మవరం, తాడిపత్రి పర్వాలేదని సమాచారం.  రాప్తాడులో పరిస్ధితి చెప్పలేకున్నారు. ఇక, ఉరవకొండలో వైసిపినే ప్రాతినిధ్యం వహిస్తోంది. అంటే కదిరిలో వైసిపి అభ్యర్ధి అత్తార్ చాంద్ భాషనే గెలిచినా తర్వాత టిడిపిలోకి ఫిరాయించాడు.  

 

న్యాయస్దానాల ద్వారా ఎంఎల్ఏ పదివిని తెచ్చుకున్న తిప్పేస్వామి మాట్లాడుతూ, జిల్లాలో టిడిపి పరిస్దితి చాలా ఘోరంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసిపి తక్కువలో తక్కువ 8 సీట్లలో గెలవటం ఖాయమంటూ జోస్యం కూడా చెప్పేశారు. చంద్రబాబు పాలనపై అన్నీ వర్గాల్లోను విపరీతమైన వ్యతిరేకత కనబడుతోందంటూ బల్లగుద్ది మరీ చెబుతున్నారు. జిల్లాలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర తర్వాత  జనాల్లో బాగా క్రేజ్ పెరిగిపోయిందని చెబుతున్న తిప్పేస్వామి మాటలు ఏ మేరకు నిజమవుతాయో చూడాల్సిందే.