తాడిపత్రిలో వైసిపి చరిత్ర సృష్టిస్తుందా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న సమీకరణలు, మారిపోతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను అంచనాలు పెరిగిపోతున్నాయి. తాడిపత్రి అంటే జేసిల అడ్డా అన్న విషయం అందరికీ తెలిసిందే. దాదాపు 35 ఏళ్ళుగా జేసి కుటుంబానికి తిరుగన్నదే లేదు. ఆరుసార్లు జేసి దివాకర్ రెడ్డి ఎంఎల్ఏగా గెలిస్తే పోయిన ఎన్నికల్లో దివాకర్ రెడ్డి తమ్ముడు జేసి ప్రభాకర్ రెడ్డి గెలిచారు. 35 ఏళ్ళుగా ఒకే కుటుంబం చేతిలో తాడిపత్రి నియోజకవర్గం ఉందంటే ఏ స్ధాయిలో వాళ్ళకు పట్టుందో అర్ధమైపోతోంది.

అలాంటిది తాజాగా నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు, సమీకరణలను చూస్తుంటే జేసిల పట్టు జారిపోతోందో అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. టిడిపి తరపున ప్రభాకర్ రెడ్డి కొడుకు జేసి అస్మిత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. వైసిపి నుండి కేతిరెడ్డి పెద్దారెడ్డి రంగంలో ఉన్నారు. నాలుగేళ్ళుగా పెద్దారెడ్డి నియోజకవర్గం మొత్తం మీద జేసిల ఆధిపత్యాన్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. దాంతో జేసిల వ్యతిరేకులకందరికీ పెద్దారెడ్డి రూపంలో ప్రత్యామ్నాయం దొరికింది.

ఇన్ని సంవత్సరాల పాటు జేసిలను ఎదిరించి నిలబడే మగాడు ఎదురుపడలేదు కాబట్టే అందరూ జేసిలంటే భయపడుతున్నారు. ఎప్పుడైతే పెద్దారెడ్డి జేసిలను ఎదిరించి నిలబడ్డారో  జేసిలంటే పడని నేతలందరూ పెద్దారెడ్డి వైపు నిలబడ్డారు. దాంతో వైసిపి అనూహ్యంగా పుంజుకుంది. అదే సమయంలో ప్రజా వ్యతిరేకత, జేసి అసమ్మతి వర్గం మొత్తం పెద్దారెడ్డికి కలసి వచ్చే అవకాశముంది.

2014లో టిడిపిలో జేసి సోదరులు చేరినా వారి మద్దతుదారుల్లో ఎక్కువమంది వైసిపిలో చేరారు.  జేసి సోదరులపై పోటీ చేసి ఓడిపోతున్న పేరం నాగిరెడ్డి వైసిపిలో చేరారు. పోయిన ఎన్నికల్లో జేసిలకు మద్దతుగా నిలబడిన గుత్తా వెంకటనాయుడు, జగదీశ్వరరెడ్డి, కాకర్ల రంగనాధ్, ఫయాజ్, జయచంద్రారెడ్డి లాంటి బలమైన నేతలంతా జేసిలతో విభేదించి వైసిపిలో చేరారు. నాలుగు దశాబ్దాలుగా జేసిలకు మద్దతుగా ఉన్న భోగాతి నారాయణరెడ్డి కుటుంబం ఇపుడు పెద్దారెడ్డికి మద్దతుగా నిలబడింది. కాబట్టి క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే జేసిలకు ఓటమి తప్పదనే అనిపిస్తోంది.