వచ్చే ఎన్నికలకు సంబంధించి చిత్తూరు జిల్లాలో వైసిపిని గెలిపించుకునే బాధ్యత ఎక్కువ భాగం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపైనే పడింది. జిల్లా వైసిపిలో పెద్దిరెడ్డే బాగా సీనియర్ అన్న విషయం అందరికీ తెలిసిందే. అందులోనూ బాగా స్దితిమంతుడు కూడా. దానికితోడు జిల్లాలోని మొత్తం 14 నియోజకర్గాల్లోనూ బాగా పాపులర్. అనుచరులు కూడా బాగానే ఉన్నారు. దాంతో పార్టీ ఏ కార్యక్రమం మొదలుపెట్టినా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ముందుగా గుర్తుకు వచ్చేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే.
పోయిన ఎన్నికల్లో పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో తాను పోటీ చేస్తూనే రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలో కొడుకు మిధున్ రెడ్డిని పోటీ చేయించారు. అంటే ఒకేసారి రెండు నియోజకవర్గాలను చూసుకోవాలి. ఒకటి మద్దతుదారులను కూడదీసుకుని దిశానిర్దేశం చేయటం, రెండోది ఖర్చులను భరించటం. ఇప్పటి ఎన్నికల్లో ఖర్చులనుభరించటమంటే అందులోనూ రెండూ ఓపెన్ నియోజకవర్గాలైతే ఇక చెప్పాల్సిన పనేలేదు. రెండింటిలో పెద్దిరెడ్డి సక్సెస్ అయినందువల్లే రెండు సీట్లలోను తండ్రి, కొడుకులు గెలిచారు.
పెద్దిరెడ్డి సామర్ధ్యం జగన్ కు తెలుసుగనుకే ఇపుడు తంబళ్ళపల్లి అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలు కూడా అప్పగించారు. దాదాపు మూడేళ్ళుగా తంబళ్ళపల్లి బాధ్యతలను కూడా పెద్దిరెడ్డే మోస్తున్నారు. మోయటమంటే ఏదో పైపైన తిరగటం కాదు. నియోజకవర్గంలో జరిగే పార్టీ కార్యక్రమాల ఖర్చుమొత్తాన్ని భరించాలి. అదే సమయంలో పార్టీ నేతలు, శ్రేణులను ముందుండి నడిపించాలి. ఇటువంటి పరిస్ధితుల్లో వచ్చే ఎన్నికల్లో పెద్దిరెడ్డి తమ్ముడు పెద్దిరెడ్డి ద్వారకనాధ్ రెడ్డికే తంబళ్ళపల్లి అసెంబ్లీ టిక్కెట్టు ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరగుతోంది. అదే నిజమైతే పుంగనూరు అసెంబ్లీ, రాజంపేట పార్లమెంటుతో పాటు తంబళ్ళపల్లి అసెంబ్లీ నియోజకవర్గం గెలుపు బాధ్యతలు కూడా రామచంద్రారెడ్డిపైనే పడుతుంది. అంటే ఒకవిధంగా వచ్చే ఎన్నికలు పెద్దిరెడ్డి సామర్ధ్యానికి పెద్ద పరీక్ష అనే చెప్పుకోవాలి.