వచ్చే ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేయబోతున్నారా ? అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అవుననే సమాధానమొస్తోంది. ఇప్పటి వరకూ పవన్ పోటీ చేయబోయే సీట్లలో ఏలూరు, అనంతపురం లాంటి నియోజకవర్గాల పేర్లు వినిపించిన విషయం అందరికీ తెలిసిందే. ఏలూరులో పోటీకి పవన్ ఏకంగా ఓటు హక్కు కూడా తీసుకున్నారని ఆమధ్య బాగా ప్రచారమైంది. కానీ తాజాగా తిరుపతికి చెందిన వర్గాల ప్రకారమైతే పవన్ మొగ్గు తిరుపతి నియోజకవర్గంపైనే ఉందట.
ఇంతకీ పవన్ దృష్టి తిరుపతిపైనే ఎందుకున్నట్లు ? ఎందుకంటే, నాలుగు కారణాలు వినిపిస్తున్నాయి. మొదటిది తిరుపతి ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక కేంద్రం. రెండోది ఇక్కడ పవన్ సామాజికవర్గ (బలిజ) ఓట్లు చాలా ఎక్కువ. మూడోది ప్రజా రాజ్యం పార్టీ వ్యవస్దాపకుడు, అన్న, మెగాస్టార్ చిరంజీవి ప్రాతినిధ్యం వహించిన స్ధానం. మూడో కారణంలో సెంటిమెంటు కూడా ఉందిలేండి. ఇక, నాలుగో కారణమేమిటంటే, చంద్రబాబునాయుడు సొంత జిల్లా కావటం.
చిత్తూరు జిల్లాలో రాజకీయంగా కీలకమైన తిరుపతిలో పవన్ పోటీ చేస్తే ఆ ప్రభావం మొత్తం జిల్లా అంతటా కనబడటమే కాకుండా రాయలసీమలో కూడా ప్రభావం చూపుతుందని పవన్ కోటరి భావిస్తున్నట్లు సమాచారం. రాయలసీమలోని చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో బలిజ సామాజికవర్గం జనాభా చాలా ఎక్కువ. అదే విధంగా రాయలసీమకు అనుకునే ఉండే నెల్లూరు జిల్లాలో కూడా బలిజల ప్రాబల్యం తక్కువేమీ కాదు. అందుకనే పవన్ ప్రభావంతో ఈ ఐదు జిల్లాల్లో మెజారిటీ నియోజకవర్గాలు జనసేన ఖాతాలో పడే అవకాశాలున్నాయని కోటరిలో ముఖ్యులు గట్టిగా చెప్పినపుడు పవన్ కూడా సానుకూలంగా స్పందించారట.
అయితే, ఏదైనా కారణం వల్ల తిరుపతి నుండి పవన్ పోటీ చేయలేక పోతే రెడ్డి సామాజికవర్గంలోని గట్టి నేతను రంగంలోకి దింపేందుకు కూడా ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే, జనసేన పోటీలో ఉన్నపుడు ఎలాగూ బలిజల ఓట్లు పార్టీ అభ్యర్ధికే పడతాయి. అపుడు అభ్యర్ధిని బలిజ కాకుండా రెడ్డి సామాజికవర్గం నుండి ఎంపిక చేస్తే ఆ సామాజికవర్గం ఓట్లు కూడా జనసేనకే పడే అవకాశం ఉంది కాబట్టి తమ అభ్యర్ధి కచ్చితంగా గెలుస్తాడనే నమ్మకంతో పవన్ ఉన్నట్లు సమాచారం. ఎన్నికలకు ఇంకా కొంత వ్యవధి ఉంది కాబట్టి అప్పటికి మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.