కోట్ల-కెఇ వర్గాలు కలుస్తాయా ?

లెక్కల్లో ఒకటి ఒకటి కలిపితే రెండన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ రాజకీయాల్లో ఒకటి, ఒకటి కలిస్తే రెండువ్వాలన్న రూలేమీలేదు.  రెండు కావచ్చు లేదా సున్నా కూడా కావచ్చు. అదే రాజకీయమంటే. అందుకు నిదర్శనమే మొన్నటి తెలంగాణా ఎన్నికల ఫలితం. కాంగ్రెస్, టిడిపి కలిస్తే తెలంగాణాలో ఎదురన్నదే ఉండదని అనుకున్నారు. ఇద్దరూ కలిసి పోటీ చేశారు. కానీ ఏమైంది గుండుసున్నా అయ్యింది. ఎంతో బలమైన పార్టీలనుకున్నవి చతికిలపడ్డాయి.

ఇదంతా ఎందుకంటే కర్నూలు జిల్లాలో టిడిపి పరిస్దితి గరించే. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన కోట్ల సూర్యప్రకాశ రెడ్డి కుటుంబం టిడిపిలో చేరటమైతే ఖాయమైపోయింది. తానడిగిన ప్యాకేజికి చంద్రబాబునాయుడు ఒప్పుకుంటే వెంటనే కోట్ల టిడిపిలో చేరుతారు. ఇక్కడే జిల్లా రాజకీయాలు ఆసక్తిగా మారాయి. కోట్ల అడుగుతున్న అసెంబ్లీ సీట్లలో డోన్ ప్రస్తుతం కెఇ చేతిలో ఉంది. ఆ ఒక్క సీటు దగ్గరే చంద్రబాబు ముందు పంచాయితీ నడుస్తోంది. ఇటు కోట్ల, అటు కెఇ సోదరులు డోన్ నియోజకవర్గం టిక్కెట్టు కోసం పట్టుబట్టి కూర్చున్నారు. సరే డోన్ సీటును ఎవరికిచ్చిన చంద్రబాబు రెండో వాళ్ళకి సర్దిచెబుతారనుకోండి.

ఇక్కడే అసలైన పాయింటుంది. అదేమిటంటే, కోట్ల-కెఇ కుటుంబాల మధ్య దశాబ్దాల వైరం నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇద్దరి మధ్య తారస్ధాయిలో ఫ్యాక్షన్ రాజకీయాలు నడిచాయి. రెండువర్గాల్లోను ఎంతోమంది నరుక్కుని చేనిపోయారు. అందుకే ఫ్యాక్షన్ ప్రత్యర్ధులే కాకుండా రాజకీయంగా కూడా బద్ధ శతృత్వంతో ఉన్నాయి రెండు కుటుంబాలు. అందుకనే రెండు కుటుంబాలు కూడా సాధ్యమైనంత వరకూ చెరో పార్టీలో ఉండేవి. కానీ ఇపుడు రెండు కుటుంబాలు ఒకేపార్టీలో రాజకీయం చేయబోతున్నాయి. కోట్ల కుటుంబం టిడిపిలో చేరితే కెఇ వర్గం సహకరిస్తుందా అన్నదే ప్రశ్న.

చంద్రబాబు చెప్పాడుకదాని పై స్ధాయిలో కెఇ, కోట్ల కుటుంబాలు కలసిపోయిన వాళ్ళ వైరం వల్ల ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల్లోని వాళ్ళు రాజీ పడగలరా ? అన్నదే ఇపుడు అందరిలోను తలెత్తిన ప్రశ్న. ఎన్నికల్లో పదవుల కోసం వాళ్ళిద్దరూ ఒకటైపోయినట్లు కాదు జిల్లా, మండల, గ్రామస్ధాయిలో వాళ్ళ వర్గాలు కలవటం. మరి వాళ్ళిద్దరు కలయికను గ్రామస్ధాయిలోని రెండు వర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాల్సిందే. దానిమీదే కర్నూలు జిల్లాలో టిడిపి భవిష్యత్తు ఆధారపడుంది.