తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి మహానాడు కడప జిల్లాలో జరగనుండటంతో ఈసారి వేడుకలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ సభను చరిత్రాత్మకంగా మలచేందుకు టీడీపీ శ్రేణులు తహతహలాడుతున్నాయి. అయితే, పార్టీ నాయకత్వం కాకుండా, కార్యకర్తలు, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశం ఒక్కటే.. జూనియర్ ఎన్టీఆర్ ఈ మహానాడులో కనిపిస్తారా?
ఇటీవలకాలంలో ఎన్టీఆర్ వ్యవహార శైలిలో వస్తున్న మార్పులు, నందమూరి కుటుంబ కార్యక్రమాల్లో అతడి చురుకైన పాల్గొనడం రాజకీయంగా కొత్త ఊహాగానాలకు తావిస్తోంది. బాలకృష్ణ పద్మభూషణ్ అందుకున్న సమయంలో ఎన్టీఆర్ ఇచ్చిన స్పందన, ‘ఆర్ఆర్ఆర్’ కన్సర్ట్ సందర్భంగా బాలయ్య పేరు స్పందించడం, అలాగే పలు ఈవెంట్స్ లలో కుటుంబ సభ్యులతో తీసుకున్న ఫొటోలు..ఇవన్నీ కూడా పాజిటివ్ వైబ్ ను క్రియేట్ చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో మహానాడు వేదికపై ఆయన కనిపిస్తే, ఆ దృశ్యం టీడీపీకి భావోద్వేగ వాతావరణాన్ని కలిగించడమే కాదు, పార్టీ మద్దతుదారుల్లో కొత్త శక్తిని నింపనుంది. ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ మహానాడుకు హాజరు కానున్నారనే విషయంపై అధికారిక సమాచారం ఏదీ లేకపోయినా, పార్టీ వర్గాలు మాత్రం తలపోయిన అతిథుల జాబితాలో ఆయన పేరు ఉందనే సంకేతాలు ఇస్తున్నాయి.
నారా లోకేష్ ఇప్పటికే కీలక నాయకుడిగా పార్టీని ముందుకు తీసుకెళ్తున్న వేళ, ఎన్టీఆర్ రాకతో నందమూరి కుటుంబం పునఃఐక్యత సంకేతం అందించేందుకు అవకాశం ఉంటుంది. ఇది రాజకీయంగా కాకపోయినా, టీడీపీ శ్రేణుల్లో మానసిక బలం పెంచే పరిణామంగా నిలవొచ్చు. ఇక చివరికి, పిలిస్తే ఎన్టీఆర్ వస్తాడా? అనే ప్రశ్నకు జవాబు కోసం రాజకీయ వర్గాల కన్నే కాదు, అభిమానుల చూపు కూడా కడపవైపే ఉంది.