ప్లీనరీలో ప్రత్యేక హోదాపై వైఎస్ జగన్ మాట్లాడతారా.?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీకి సర్వం సిద్ధం చేస్తున్నాయి ఆ పార్టీ శ్రేణులు. కనీ వినీ ఎరుగని రీతిలో ఈ ప్లీనరీని విజయవంతం చేయడానికి అధికార వైసీపీ, శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. పెద్దయెత్తున జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారీ స్థాయిలో అక్కడ జరుగుతున్న ఏర్పాట్లు చూస్తోంటే, రాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ పార్టీ చేయనంత పెద్ద స్థాయిలో ఈ ప్లీనరీని వైసీపీ నిర్వహించనుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

ఇంతకీ, ప్లీనరీ వేదికపైనుంచి పార్టీ అధినేత వైఎస్ జగన్, వైసీపీ శ్రేణులకు ఎలాంటి సందేశం ఇస్తారు.? తెలంగాణలో ఎప్పుడో వైసీపీ దుకాణం బంద్ అయిపోయింది. సో, తెలంగాణ గురించి మాట్లాడే ప్రసక్తి వుండదు. మరి, ఆంధ్రప్రదేశ్ గురించి వైఎస్ జగన్ ఏం మాట్లాడతారు.? ప్రత్యేక హోదాపై మాట్లాడతారా.? కేవలం విపక్షాలపై విమర్శలతో సరిపెడతారా.? సంక్షేమ పథకాల విషయంలో సొంత డబ్బా మామూలేనా.? లేదంటే, కంద్రంపై విరుచుకుపడతారా.?

ఎన్నెన్నో ప్రశ్నలు వైసీపీ శ్రేణుల మదిలో మెదులుతున్నాయి. నిజానికి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి ఓ ‘ఫైర్’ ఆశిస్తున్నారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. ‘కేంద్రం మెడలు వంచుతాం.. ప్రత్యేక హోదా సాధిస్తాం.. పోలవరం మేమే పూర్తి చేసి తీరతాం.. విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణను ఆపుతాం.. కడప స్టీలు ప్లాంటు కట్టి చూపిస్తాం..’ ఇలాంటి మాటల్ని వైఎస్ జగన్ నుంచి వైసీపీ శ్రేణులే కాదు, రాష్ట్ర ప్రజలూ ఆశిస్తున్నారు.

కానీ, అవేమీ ప్లీనరీలో వినిపించవు. దత్తపుత్రుడి వ్యవహారం, చంద్రబాబుపై విమర్శలు, దుష్ట చతుష్టయం.. ఇవే వైఎస్ జగన్ ప్రసంగాల్లో రిపీట్ అవబోతున్నాయట.