అవును వినటానికి విచిత్రంగానే ఉంది. ఇప్పటి వరకూ అసెంబ్లీలో ఉన్నది రెండే పార్టీలు. మొదటిది అధికార వైసిపి అయితే రెండోది ప్రధాన ప్రతిపక్షం టిడిపి. మరి మూడో పక్షానికి అవకాశం ఎక్కడిది ? ఎక్కడిదంటే బిజెపి పక్షం రెడీ అవుతోందట.
మొన్నటి ఎన్నికల్లో బిజెపికి కనీసం 1 శాతం ఓట్లు కూడా రాలేదు. అలాంటిది అసెంబ్లీలో బిజెపికి ఎంఎల్ఏలు ఎలా వస్తారు ? ఎలాగంటే పార్టీ ఫిరాయింపులకు పాల్పడటం ద్వారా. టిడిపిలోని 23 మంది ఎంఎల్ఏల్లో నిట్టనిలువుగా చీలకవస్తుందని బిజెపి ఎంఎల్సీ మాధవ్ చెబుతున్నారు. చీలక వర్గం బిజెపిలో కలుస్తుందని కూడా ఆయనగారు జోస్యం చెప్పారు.
అంటే మొన్న రాజ్యసభ ఎంపిలను లాక్కున్నట్లుగానే ఎంఎల్ఏల్లో కూడా చీలిక తెచ్చి చీలిక వర్గాన్ని బిజెపిలో చేర్చుకుంటారన్నమాట. అపుడు టిడిపిలో ఉండేదెంతమంది ? బిజెపిలోకి వెళ్ళేదెంతమంది ? అనే విషయంపై ప్రధాన ప్రతిపక్ష హొదా ఎవరిది అనే విషయం తేలుతుంది.
మొత్తం మీద అసెంబ్లీలో చంద్రబాబునాయుడుకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కూడా బిజెపికి దక్కనిచ్చేట్లు లేదు. మోడిని ప్రధానమంత్రి కాకుండా అడ్డుకుంటానని సవాలు విసిరిన చంద్రబాబు చివరకు బోర్లా పడ్డారు. దాంతో మండిపోయిన బిజెపి ఇపుడు చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ను ఊడబీకేంత వరకూ నిద్రపోయేట్లు లేదు.