తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టయి, దాదాపు యాభై రోజుల అనంతరం రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే.
రాజమండ్రి నుంచి అమరావతికి ‘వాహన శ్రేణి’తో బోల్డంత హంగామా నడుమ సుదీర్ఘ ప్రయాణం చేసి తన నివాసానికి వెళ్ళారు చంద్రబాబు. అనారోగ్య సమస్యలతో బెయిల్ పొంది, ఇంత సుదీర్ఘ ప్రయాణం కేవలం ‘పబ్లిసిటీ కోసం’ చేయాల్సిన అవసరం వుందా.?
పోనీ, ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు కనుమరుగైపోయే పరిస్థితుల్లో వున్న టీడీపీకి, ఇలా జవసత్వాలు కూడదీయాలని టీడీపీ అధినాయకత్వం భావిస్తే, అది వేరే చర్చ. కానీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంలేదని ప్రకటించాక, తెలంగాణలో ఎందుకు ‘షో’ చెయ్యడం.?
నిన్న రాత్రి హైద్రాబాద్‌కి చేరుకున్నారు చంద్రబాబు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైద్రాబాద్ చేరుకున్నాక, అసలు కథ మొదలైంది. ఎన్నికల కోడ్ అమల్లో వుండడంతో, చంద్రబాబు మీద కేసు కూడా నమోదయ్యింది.. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారన్న కోణంలో.
సరే, ఎన్నికల సమయంలో నమోదయ్యే కేసులు సుదీర్ఘ కాలం పాటు ‘సాగుతుండడం’ అందరికీ తెలిసిన సంగతే.! కానీ, సుదీర్ఘ రాజకీయ అనుభవం తనకుందని చెప్పుకునే చంద్రబాబు, ఇలా ఎందుకు చేస్తున్నట్టు.?
ఇదిలా వుంటే, చంద్రబాబుకి ఏఐజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అక్కడే ఆయనకు వైద్య చికిత్స కూడా అందించనున్నారు. మరోపక్క, కంటికి శస్త్ర చికిత్స కోసం ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి చంద్రబాబు వెళతారు.
ఈ కంటి శస్త్ర చికిత్స నిమిత్తమే, చంద్రబాబుకి మద్యంతర బెయిల్‌ని ఉన్నత న్యాయస్థానం మంజూరు చేసిన సంగతి తెలిసిందే.