పవన్ రెండు చోట్లా ఎందుకోడిపోయారో తెలుసా ?

ఆ విషయాన్ని స్వయంగా జనసేన అధినేత పవన్ కల్యాణే బయటపెట్టారు. చంద్రబాబునాయుడు టిడిపి ఓటమికి ఎలాంటి కారణాలైతే చెబుతున్నారో అలాంటి కారణాలనే పవన్ చెబుతున్నారు. తాను పోటీ చేసిన భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో పూర్తిస్ధాయిలో ఓటర్లను  కలవలేకపోయారట. ఓటర్లను ఎందుకు కలవలేక పోయారయ్యా అంటే సమయం ఎక్కువగా లేదట.

విచిత్రంగా లేదు పవన్ చెప్పిన కారణం.  ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుండి పవన్ కే కాదు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబుకు కూడా ఉన్న సమయం కొద్ది రోజులే.  ఉన్న సమయాన్నే జగన్,  చంద్రబాబు సద్వినియోగం చేసుకుంటే  పవన్ ఫెయిలయ్యారంతే.

జనాలు జనసేనకైనా పవన్ కైనా ఓట్లేయకపోవటానికి కారణాలు వేరే ఉన్నాయి. వాటిని అంగీకరించటానికి పవన్ కూడా సిద్ధంగా లేరని తెలిసిపోతోంది. పవన్, చంద్రబాబు ఒకటే అన్న జగన్ ఆరోపణను జనాలు నిజమే అని నమ్మారు. జనసేనకైనా, పవన్ కైనా ఓట్లేస్తే అది చంద్రబాబుకో లేకపోతే టిడిపికో వేసినట్లే అని జనాలు అభిప్రాయపడ్డారు. అందుకే జనసేనకు కానీ పవన్ కు కానీ ఓట్లేయలేదు.

అంతెందుకు ఎన్నో  ఆశలు పెట్టుకున్న సొంత సామాజికవర్గం కాపులు కూడా పవన్ ను నమ్మలేదు. అందుకే ఉభయ గోదావరి జిల్లాల్లోని కాపులు కూడా పవన్ కు ఓట్లు వేయలేదు. పవన్ పోటీ చేసిన భీమవరం, గాజువాకలో ఓటర్లు  పవన్ ను తిరస్కరించిన కారణం అదే. పవన్ ను గెలిపించినా అసెంబ్లీకి వెళ్ళడని, సమస్యలు చెప్పుకోవాలంటే అందుబాటులో ఉండడని జనాలు అభిప్రాయపడ్డారు. అందుకే పవన్ ను రెండు చోట్లా ఓడగొట్టారు.