కోడికత్తి కేసులో కేంద్రం అనవసరమైన ఆశక్తి చూపుతోంది…చంద్రబాబు
కోడికత్తి కేసు అంతర్జాతీయ విచారణ సంస్ధకు అప్పగించినా నిజం మారదు..నారా లోకేష్
చంద్రబాబునాయుడు, పుత్రరత్నం నారా లోకేష్ తాజా స్పందన చూస్తుంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది ? రెండు స్పందనలు పరస్పర విరుద్ధంగా లేవూ ? ఇంతకీ విషయం ఏమిటి ? ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి పై జరిగిన హత్యాయత్నం కేసు విచారణను హై కోర్టు ఎన్ఐఏకి అప్పగించగానే చంద్రబాబు ఒకలా, లోకేష్ మరోలా స్పందించారు. కేసు విచారణను కేంద్ర దర్యాప్తు సంస్ధలకు అప్పగించటం చంద్రబాబు అండ్ కోకు ఏమాత్రం ఇష్టం లేదన్నవిషయం అందిరికీ తెలిసిందే. అందుకే హైకోర్టు నిర్ణయాన్ని తప్పుపడుతున్నట్లు చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. కోడికత్తి కేసులు కేంద్రం అనవసర ఆశక్తి చూపుతున్నట్లు మండిపడ్డారు.
శాంతి భద్రతలు రాష్ట్రం పరిధిలోని అంశాలు కాబట్టి కేంద్రం జోక్యం చేసుకునేందుకు లేదన్నట్లు ఆక్షేపించారు. కేసు విచారణను ఎన్ఐఏకి అప్పగించటం సమాఖ్య స్పూర్తికి విరుద్ధమట. ఈ విషయాన్ని కోర్టులోనే తేల్చుకుంటామని చంద్రబాబు చెప్పటమే విచిత్రంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని సిట్ తో విచారణ జరిపించి కేసును మూసేయిద్దామని చంద్రబాబు అనుకున్నట్లున్నారు. కానీ జగన్ ఎప్పుడైతే హై కోర్టును ఆశ్రయించారో చంద్రబాబుకు సమస్య మొదలైంది. అందుకే ఇఫుడు జగన్, కోర్టు, కేంద్రంపై మండిపోతున్నారు. ఫిరాయింపు ఎంఎల్ఏ కిడారి సర్వేశ్వరరావు హత్య కేసును ఎన్ఐఏ సూమోటోగా తీసుకున్నపుడు మాత్రం చంద్రబాబు ఏమీ మాట్లాడక పోవటం గమనార్హం.
ఇక, అపర మేధావి నారా లోకేష్ సంగతి చూస్తుంటే హైకోర్టు నిర్ణయంపై వెటకారమే కనిపిస్తోంది. కోడికత్తి కేసును అంతర్జాతీయ విచారణ సంస్ధకు అప్పగించినా నిజం మారదట. ఢిల్లీ మోడ, ఆంధ్రామోడి కోడికత్తితో యుద్ధానికి కాలు దువ్వుతున్నారంటూ లోకేష్ ట్విట్టర్లో చెప్పటం విచిత్రంగా ఉంది. తుస్సుమన్న కోడికత్తి డ్రామాకు కొత్త డైరెక్టరును పెట్టినంత మాత్రాన రక్తి కట్టదని లోకేష ట్వీట్లో ఎంత వెటకారం కనిపిస్తోందో. నిజంగానే జగన్ ది కోడికత్తి డ్రామా అయితే దాన్నే నిరూపించవచ్చు కదా ? ఆ పని ఎందుకు చేయటం లేదు ?
ఘటన జరిగిన దగ్గర నుండి హత్యాయత్నమంతా డ్రామానే అని నిరూపించేందుకు ప్రభుత్వం, టిడిపి నేతలు నానా అవస్తలు పడ్డారు. కానీ వాళ్ళు చేసిన ప్రయత్నాలన్నీ ముందు తేలిపోయాయి. జగన్ అండ్ కో వాదన, అనుమానలే నిజాలని అనిపిస్తున్నాయి. సిట్ విచారణ అయితే ఏదోలా మాయ చేయచ్చని చంద్రబాబు అనుకున్నారు. కానీ హై కోర్టు ఎప్పుడైతే కేసు విచారణను ఎన్ఐఏకి అప్పగించిందో అప్పటి నుండే చంద్రబాబులో టెన్షన్ కనబడుతోంది. సరిగ్గా ఎన్నికలకు ముందు తిరిగిన కీలక మలుపు ఎక్కడికి దారితీస్తుందో చూడాల్సిందే