చంద్రబాబునాయుడు వైఖరి చాలా విచిత్రంగా ఉంది. ఎన్నికల కోడ్ ప్రకారం చంద్రబాబు సమీక్షలు చేసేందుకు లేదు. ఏదో అత్యవసర పరిస్ధితులు వచ్చినపుడు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో తప్ప సమీక్షలు చేయకూడదని ఎలక్షన్ కమీషన్ స్పష్టంగా చెబుతోంది. అయినా సరే తాను సమీక్షలు చేయాల్సిందేనంటూ చంద్రబాబు పట్టుబడుతున్నారు. తన సమీక్షలను అడ్డుకోకుండా ఎలక్షన్ కమీషనర్ గోపాల కృష్ణ ద్వివేదికి ఆదేశాలివ్వాలంటూ చంద్రబాబు సీఈసీకి లేఖ రాయటమే విచిత్రంగా ఉంది.
చంద్రబాబు చేయాలనుకుంటున్న సమీక్షలేమిటంటే పోలవరం, రాజధాని నిర్మాణాలట. ఇవేమీ అత్యవసరాల క్రిందకు రావన్న విషయం తెలియదా ? మరి తెలిసి కూడా ఎందుకంతలా ఆరాటపడిపోతున్నారు ? ఎందుకంటే, పదవిలో నుండి దిగిపోయేటపుడు సమీక్షల పేరుతో కోట్ల రూపాయలు దండుకునేందుకే అంటూ వైసిపి ఆరోపిస్తోంది.
ఐదేళ్ళపాటు చంద్రబాబు పోలవరం, రాజధాని నిర్మాణాలు చేసిన వైనం అందరూ చూసిందే. రాజధాని నిర్మాణం కోసమంటూ కోట్ల రూపాయల ప్రజాధనంతో విదేశాలు తిరిగి చివరకు ఒక్క శాస్వత ఇటుకు కూడా వేయలేదు. అలాగే పోలవరం నిర్మాణం పేరుతో అంచనాలు పెంచేసిన విషయం అందరికీ తెలిసిందే. జరిగిన పనులు కొంతే అయినా చేసుకున్న ప్రచారం మాత్రం విపరీతం.
ఐదేళ్ళ విలువైన కాలాన్ని సమీక్షల మీద సమీక్షల పేరుతో వృధా చేసిన చంద్రబాబు చివరినిముషంలో మాత్రం రాష్ట్రాభివృద్ధిపై అమితమైన ప్రేమున్నట్లు బిల్డప్ ఇస్తున్నారు. తాను సమీక్షలు చేయకపోతే అభివృద్ధి అంతా ఆగిపోతుందన్నట్లుగా మాట్లాడుతున్నారు. చంద్రబాబుకు బదులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం సమీక్షలు చేస్తారు. జరుగుతున్న నిర్మాణాలను ఎల్వీనే పర్యవేక్షిస్తారు. ఎల్వీ వేలు పెట్టటమే చంద్రబాబుకు ఇష్టం లేదు. చంద్రబాబు పట్టుదల చూస్తుంటే వైసిపి చేస్తున్న ఆరోపణలే నిజమేనేమో అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయ్.