వైసిపిలో చేరుతున్నందుకేనా మంట

చంద్రబాబునాయుడు ఉక్రోషంలో రెండు కారణాలు కనబడుతున్నాయి. మొదటిది సరిగ్గా ఎన్నికలకు ముందు ఎంఎల్ఏలు, ఎంపి రాజీనామా చేయటం. ఇక రెండోది రాజీనామా చేసిన నలుగురిలో  ముగ్గురు వైసిపిలో చేరటం. వైసిపిని దెబ్బ కొట్టేందుకు చంద్రబాబు ఫిరాయింపులను ప్రోత్సహించిన సంగతి అందరికీ తెలిసిందే. 22 మంది ఎంఎల్ఏలు, ముగ్గురు ఎంపిలను ప్రలోభాలతో లాక్కున్న విషయం తెలిసిందే. ఎంతమందిని చంద్రబాబు లాక్కున్నా జగన్మోహన్ రెడ్డి మాత్రం తొణకలేదు బెణకలేదు.

దాంతో చంద్రబాబులో జగన్ అంటే మంట పెరిగిపోయింది.  అసెంబ్లీలో కానీ బయటకానీ ఎన్నిరకాలుగా జగన్ ను అవమానించాలో అంతా చేశారు. అయినా చంద్రబాబును లెక్కచేయకుండా జగన్ పాదయాత్ర  పేరుతో జనాల్లోకి వెళ్ళిపోయారు. పాదయాత్రకు కనబడిన జనస్పందనతో చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోయింది. సరే అదే సమయంలో ఎన్డీఏలో నుండి చంద్రబాబు బయటకు వచ్చేయటం తర్వాత జరిగిన పరిణామాలన్నీ అందరికీ తెలిసినవే.

కొద్ది రోజుల్లో పాదయాత్ర ముగుస్తుందనగా విశాఖపట్నం విమానాశ్రయంలో తనపై  జరిగిన హత్యాయత్నం నుండి జగన్ తప్పించుకున్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, హత్యాయత్నం ఘటనపై హై కోర్టు ఎన్ఐఏతో విచారణ జరిపించటం లాంటివి చంద్రబాబులోని అసహనాన్ని పీక్సుకు తీసుకెళ్ళింది. మరికొద్ది రోజుల్లో షెడ్యూల్ ఎన్నికలు వస్తున్నాయనగా వరుసబెట్టి ఎంఎల్ఏలు, ఎంపి రాజీనామాలు చేయటాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. రాజీనామాలు చేసిన నలుగురిలో ముగ్గురు నేరుగా వైసిపి కండువా కప్పుకోవటాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకున్నారు. దాంతోనే నోటికొచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారు.