కౌంటింగ్ సందర్భంగా గురువారం రాష్ట్రంలో అల్లర్లు జరుగుతాయన్న అనుమానంతో కేంద్ర ఎన్నికల కమీషన్ అదనపు బలగాలను మోహరించింది. అదనపు బలగాలను మోహరించటంపైన కూడా చంద్రబాబునాయుడు మండిపోతున్నారు. ఎలక్షన్ కమీషన్ చేసే ప్రతీ పనినీ విమర్శించటమే ఏకైక అజెండాగా పెట్టుకున్నారేమో అర్ధం కావటం లేదు. లేకపోతే అదనపు బలగాలను దించితే సంతోషించాల్సిన చంద్రబాబు కోపం చేసుకోవటం ఏమిటో అర్ధం కావటం లేదు.
పోలింగ్ జరిగిన దగ్గర నుండి వైసిపి అల్లర్లు సృష్టించేందుకు పన్నాగాలు వేస్తోందని చంద్రబాబు పదే పదే చెప్పిన విషయం అందరూ చూసిందే. అదే సమయంలో ఫలితాలు వెలువడే రోజు గొడవలు చేయటానికి టిడిపి ప్లాన్ చేస్తోందని వైసిపి నేతలు కూడా ఆరోపించారు. దానికితోడు అదే విషయాన్ని కేంద్ర ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు కూడా చేశారు.
పోలింగ్ రోజు జరిగిన అల్లర్లను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ఎన్నికల కమీషన్ కూడా రాష్ట్రంలోని సమస్యాత్మక నియోజకవర్గాల్లో అదనపు బలగాలను మోహరించింది. వైసిపి అంచనాల ప్రకారం 28 నియోజకవర్గాల్లో అల్లర్లు జరిగేందుకు అవకాశాలున్నాయి. జమ్మలమడుగు, ఆళ్ళగడ్డ, తాడిపత్రి, రాప్తాడు, కోయిలకుంట్ల, చిత్తూరు, తంబళ్ళపల్లి, పూతలపట్టు, నెల్లూరు, మైలవరం, గన్నవరం, గుడివాడ, చంద్రగిరి లాంటి నియోజకవర్గాల్లో గొడవలు జరిగే అవకాశాలున్నాయని వైసిపి అనుమానిస్తోంది.
ఈ నేపధ్యంలోనే చంద్రబాబు కేంద్ర ఎన్నికల కమీషన్ పై మండిపోతున్నారు. పోలింగ్ సందర్భంగా ఏర్పాటు చేయని అదనపు బలగాలు కౌంటింగ్ సందర్భంగా ఎందుకంటే ఆక్షేపిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల్లోనే అవసరమైతే గొడవలు చేయాలని కౌంటింగ్ ఏజెంట్ల శిక్షణా తరగతుల్లోనే బాగా నూరిపోశారు. ఆ విషయం బయటకు పొక్కింది. దాంతో అదనపు బలగాలు వస్తే గొడవలకు అవకాశాలు ఉండవన్న దురుద్దేశ్యంతోనే చంద్రబాబు ఎన్నికల కమీషన్ పై మండుతున్నట్లు అర్ధమైపోతోంది.