తన విలువను తానే తగ్గించేసుకుంటున్నారా ?

చంద్రబాబునాయుడు చేష్టలు చూసిన వాళ్ళకు ఇపుడిదే అనుమానం పెరిగిపోతోంది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని తన భుజాన్ని తానే చరుచుకునే చంద్రబాబు ప్రతీ చిన్న విషయానికీ ఢిల్లీకెక్కి మరీ గోల చేస్తున్నారు. దాంతో తన విలువను తానే దిగజార్చేసుకుంటున్నారు. తాజాగా జరిగిన ఓ ఘటనే ఇందుకు నిదర్శనం.

ఇంతకీ విషయం ఏమిటంటే, చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల కమీషన్ రీ పోలింగ్ కు ఆదేశించింది. ఈ ఐదు కేంద్రాల్లో టిడిపి ఏకపక్షంగా రిగ్గింగ్ చేసుకున్నట్లు వైసిపి అభ్యర్ధి, సిట్టింగ్ ఎంఎల్ఏ చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఫిర్యాదు చేశారు. వీడియో సాక్ష్యాలుగా చెవిరెడ్డి చేసిన ఫిర్యాదును పరిశీలించిన సీఈసీ ఫిర్యాదుతో ఏకీభవించింది. ఇపుడా విషయం మీదే చంద్రబాబునాయుడు గగ్గోలు పెట్టేస్తున్నారు.

పోలింగ్ జరిగిన ఇన్ని రోజులకు రీ పోలింగ్ కు ఆదేశాలు ఇవ్వటమేంటి అనేది చంద్రబాబు వాదనగా ఉంది. అంతేకానీ అక్కడ రిగ్గింగ్ జరిగిందా ? లేదా ? అన్న విషయాన్ని పట్టించుకోవటం లేదు. ఊరికే ఫిర్యాదు చేసేస్తే సీఈసీ రీ పోలింగ్ కు ఆదేశిస్తుందా ? అన్న ఆలోచన కూడా చంద్రబాబులో లోపించింది.

సీఈసీ ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తోందంటూ మండిపోయిన చంద్రబాబు వెంటనే ఢిల్లీకి వెళ్ళిపోయారు. సీఈసీ ముందు నిరసన తెలుపుతారట. అలాగే రాహూల్, మాయావతి, ములాయంసింగ్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా లాంటి జాతీయ నేతలందరినీ కలిసి రీ పోలింగ్ విషయంలో సీఈసీ ఏకపక్ష నిర్ణయాన్ని వివరించారట. రీ పోలింగ్ అంశంపైన కలిసి ఫిర్యాదు చేసే స్ధాయికి దిగజారిపోతే జాతీయ నేతలు తన గురించి ఏ విధంగా ఆలోచిస్తారనే ఆలోచన కూడా ఉన్నట్లు లేదు చంద్రబాబులో.