ఎన్నికలు దగ్గర పడేకొద్దీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ లో గందరగోళం బాగా పెరిగిపోతోంది. వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుండి పోటీ చేయాలన్నదే గందరగోళానికి కారణంగా అర్ధమవుతోంది. ఒకసారి ఏలూరంటారు. మరోసారి ఎస్టీ నియోజకవర్గమైనా సరే పాడేరు నుండే పోటీ అంటారు. మరోసారి తిరుపతి నుండి పోటీ చేయమని తనను ఒత్తిడి పెడుతున్నారంటూ పవనే స్వయంగా చెప్పారు. అంతుకుముందే అనంతపురం నుండి పోటీ చేయబోతున్నట్లు స్వయంగా పవన్ కల్యాణే ప్రకటించారు. ఇపుడేమో తాజాగా పిఠాపురమట. సినిమాల్లో ఎంతగా వపర్ స్టార్ అనిపించుకున్నా రాజకీయాల్లో పవర్ స్టార్ కాదన్న విషయాన్ని పవన్ మరచిపోయినట్లున్నారు.
నిజానికి రాజకీయాల్లో పవన్ ఇంకా ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు. కేవలం ఐదేళ్ళ క్రితం జనసేన అనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారంతే. పోయిన ఎన్నికల్లో బిజెపితో కలిసి తెలుగుదేశంపార్టీకి ప్రచారం చేసిన అనుభవం మాత్రం ఉంది. అంతమాత్రానికే రాజకీయాల్లో కూడా తాను పవర్ స్టారే అని భ్రమల్లో ఉన్నారేమో అని అనుమానం వస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుండి పోటీ చేయాలో పవన్ ఈపాటికే నిర్ణయింకుకుని ఉండాలి. అలా కాకుండా తడవకో నియోజకవర్గమం పేరు చెబుతుంటే పవన్ ను జనాలు పిచ్చోడనే అనుకుంటారు.
రాజకీయాల్లో ఎంతటి తిరుగులేదని అనుకున్న నాయకులు కూడా ఏదో ఒక నియోజకవర్గానికే పరిమితమైన విషయం అందరికీ తెలిసిందే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ది సొంత నియోజకవర్గం పులివెందుల. మరణించేరోజుకు కూడా పులివెందులకే ప్రాతినిధ్యం వహించారు. చంద్రబాబును తీసుకుంటే గడచిన మూడు దశాబ్దాలుగా కుప్పంకే పరిమితయ్యారు. సొంత నియోజకవర్గం చంద్రగిరే అయినా కుప్పంకు వలసెళ్ళి అక్కడే సెటిలైపోయారు. ఎంత పెద్ద నేతైనా తన పుట్టి పెరిగిన ఊరు ఏ నియోజకవర్గంలోకి వస్తుందో అక్కడి నుండే పోటీ చేయటానికి మొగ్గు చూపుతారు. చంద్రబాబు లాగ ఎక్కడికో వలస వెళ్ళి సెటిల్ అవ్వటమన్నది చాలా అరుదు.
రెండో పద్దతిలో తాను ఎక్కడి నుండి పోటీ చేసినా గెలుస్తానన్న నమ్మకముంటే నియోజకవర్గం ఏదైనా ఒకటే. గుడివాడ నియోజకవర్గంకు చెందిన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీయార్ మొదటి ఎన్నికల్లో తిరుపతి, హిందుపురం నుండి పోటీ చేసి గెలిచిన విషయం గుర్తుండే ఉంటుంది. ఎన్టీయార్ ఎప్పుడూ గుడివాడ నుండి పోటీ చేయలేదు. ప్రతీ ఎన్నికలోను ఏదో ఒక నియోజకవర్గం నుండి పోటీ చేసే వారు. ఒకసారి మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకర్తి నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారనుకోండి అది వేరే సంగతి. సో, బి ఫారాల మీద సంతకాలు పెట్టే పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కే తాను పోటీ చేయబోయే నియోజకవర్గంపైనే ఇంత గందరగోళమైతే మిగిలిన నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ఏం నిలబెడతారు ?