టిడిపికి ఓటేస్తుంటే వైసిపికి పడుతోందా ?

ఎన్నికల కమీషన్ కు చంద్రబాబునాయుడు ఇలాగనే ఫిర్యాదు చేశారు. ఉదయం పోలింగ్ మొదలైన కేంద్రాల్లో చాలా చోట్ల ఈవిఎంలు మొరాయించాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైన ఇంత వరకూ దాదాపు 30 శాతం ఈవిఎంలు పనిచేయటం లేదని సమాచారం.  ఇదే విషయాన్ని చంద్రబాబు ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేశారు. అదే సందర్భంగా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో టిడిపికి ఓటేసినా ఓటు మాత్రం వైసిపికే పడుతోందనే ఆరోపణలు వినబడుతున్నట్లు చంద్రబాబు చెప్పటం గమనార్హం.

స్వయంగా భారతదేశంలో టెక్నాలజీని తాను ప్రమోట్ చేశానని, ఈవిఎంల వ్యవస్ధ తన వల్లే వచ్చిందని చెప్పుకునే చంద్రబాబు కూడా ఇలాంటి ఆరోపణలు చేస్తుండటం విచిత్రంగా ఉంది. ఈవిఎంలు పనేయని పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ కు చంద్రబాబు డిమాండ్ చేశారు. రీ పోలింగ్ కు డిమాండ్ చేయటం వరకూ ఓకేనే. కానీ టిడిపికి ఓటేస్తే వైసిపికి పడుతోందనే ఆరోపణలపై ఫిర్యాదు చేయటమే ఆశ్చర్యంగా ఉంది.

చంద్రబాబు ఆరోపణలకు పూర్తి విరుద్ధంగా వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఈవిఎంలు మొరాయించటంలో టిడిపి కుట్ర ఉందంటున్నారు. భారీగా ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గరకు చేరుకోవటంతో వారంతా వైసిపికి ఓట్లేస్తారన్న అనుమానంతోనే ఈవిఎంలను పనిచేయనీయకుండా చేస్తున్నట్లు ఆరోపస్తున్నారు. ఈవిఎంలు మొరాయిస్తే చివకు ఓట్లేయకుండానే ఓటర్లు వెనదిరగటమే టిడిపికి కావాల్సిందంటూ మంగళగిరిలో వైసిపి అభ్యర్ధి ఆరోపించటం గమనార్హం.