బయటపడిన సిఎం  ‘ బోగస్ ‘ బాగోతం

రోజులు గడిచేకొద్దీ తెలుగుదేశంపార్టీ రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ బాగోతం బయటపడుతోంది.  రమేష్ జేబులోని ఓ బోగస్ కంపెనీ విషయం బయటపడింది. ఈమధ్య రమేష్ ఇంటిపై మూడు రోజుల పాటు ఐటి దాడులు జరిగిన విషయం తెలిసిందే కదా. దాడుల విషయంలో గగ్గోలు పెట్టిన రమేష్ రోజులు గడిచే కొద్దీ ఏమీ మాట్లాడటం లేదు. అప్పట్లో కేంద్రప్రభుత్వం మీద, ఐటి శాఖ పైన మీసం మెలేసి నోటికొచ్చినట్లు మాట్లాడారు. రోజులు గడిచేకొద్దీ ఆ దూకుడేమైంది. ఎందుకు మౌనంగా ఉండిపోయారు ?

 

ఎందకంటే, రోజులు గడిచేకొద్దీ, తవ్వేకొద్దీ రమేష్ అక్రమాలు బయటపడుతున్నాయట. బయటపడనంత వరకూ తాను పాదరసం లాంటి వాడినని, సత్య హరిశ్చంద్రుడికి మనవడిని అన్నట్లుగా  మాటలు చెప్పారు. విషయాలు బయటపడేకొద్దీ ఎక్కువ మాట్లాడితే మొదటికే మోసం వస్తుందన్న భయంతోనే రమేష్ ఎక్కడా నోరెత్తటం లేదని సమాచారం. తాజా సమాచారం ప్రకారం ఎడ్కో పేరుతో రాజ్యసభ సభ్యుడు పెట్టింది ఓ డొల్ల సంస్ధగా తేలుతోంది.

 

తన తమ్ముడి పేరుతో 10 డొల్ల కంపెనీలు పెట్టి కోట్లాది రూపాయలను దారి మళ్ళించాడనేది రమేష్ పై ఉన్న ఆరోపణలు. అందులో ఎడ్కో కంపెనీ కూడా ఒకటట. ఎందుకంటే, రిత్విక్ ప్రాజెక్ట్స్ పేరుతో దక్కించుకున్న ప్రాజెక్టుల్లో కొన్నింటి బిల్లులను ఎడ్కో సంస్ధకు చెల్లించారనేది తాజాగా బయటపడింది. ఎడ్కో సంస్ధ అనేది క్షేత్రస్ధాయిలో ఎక్కడా కననబడటం లేదట. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీల్లో ఎక్కడా దాని ఊసే లేదట. ఆ కంపెనీకి ఓ అడ్రస్ కూడా లేదు.

 

పైగా రిత్విక్ కంపెనీ, ఎడ్కో కంపెనీలకు ఆడిటర్, అకౌంటెంట్ కూడా ఒకరేనట. దాంతో ఎడ్కో కంపెనీ సీళ్ళు, స్టాంపుతు, లెటర్ హెడ్స్ అన్నీ అకౌంటెంట్ సాయిబాబా దగ్గర పట్టుపడ్డాయి. దానికి తోడు మరిన్ని అధారాలతో ఎడ్కో కంపెనీ అన్నది రమేష్ కు చెందిన డొల్ల కంపెనీయే అనే అనుమానాలు బలపడుతున్నాయి. తీగలాగితే డొంకంతా కదిలినట్లు ఎడ్కోను కదిలిస్తే ఇంకెన్ని డొల్ల కంపెనీల అధారాలు బయపడుతాయో ?