ఎన్ఐఏ విచారణపై చంద్రబాబుకు ఎందుకు అభ్యంతరం ?

జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసుపై చంద్రబాబునాయుడు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.  జగన్ హత్యాయత్నం కేసును ఎన్ఐఏతో విచారణ చేయించాల్సిన అవసరం లేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్రమోడికి చంద్రబాబు ఓ పెద్ద లేఖ రాశారు. కోడి కత్తి కేసు ఎన్ఐఏ పరిధిలోకి ఎలా వస్తుందని లేఖలో ప్రధానిని చంద్రబాబు నిలదీశారు. కేంద్రప్రభుత్వం చర్య ఫెడరల్ స్పూర్తికి పూర్తి విరుద్ధంగా ఉందన్నారు. టెర్రరిస్టుల చర్యలను అదుపులో పెట్టేందుకు ఎన్ఐఏని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పిన కేంద్రం ఇపుడు రాష్ట్రాల హక్కులను హరిస్తోందని మండిపడ్డారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ప్రధానికి లేఖ రాయటం వెనుక చంద్రబాబు భయమే స్పష్టంగా కనబడుతోంది.  మొదటి నుండి హత్యాయత్నం దర్యాప్తు విషయంలో సిట్ విచారణ సరిపోతుందని చంద్రబాబు అండ్ కో చాలా సార్లే చెప్పారు. ఎందుకంటే, హత్యాయత్నం కేసులో కుట్ర కోణాన్ని కప్పిపెట్టేయొచ్చని చంద్రబాబు ఆలోచన. జగన్ పై జరిగింది హత్యాయత్నమే అని వైసిపి నేతలు అంటుంటే కాదు పెద్ద డ్రామా అంటూ చంద్రబాబు అండ్ కో ఎదురుదాడి చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.   

చంద్రబాబు చేయించే విచారణ మీద నమ్మకం లేకే థర్డ్ పార్టీ విచారణకు జగన్ కోర్టులో పిటీషన్ వేశారు. పిటీషన్ కు తగ్గట్లే హై కోర్టు కూడా ఎన్ఐఏ విచారణకు ఆదేశించింది. అంతకుముందు హత్యాయత్నం కేసుపై చంద్రబాబు మాట్లాడుతూ ఘటన జరిగింది విమానాశ్రయంలో కాబట్టి బాధ్యత కూడా కేంద్రప్రభుత్వానిదే అంటూ పదే పదే చెప్పారు. అందుకనే విచారణను రాష్ట్ర పోలీసుల పరిధిలో నుండి తప్పించి ఎన్ఐఏకి అప్పగించింది. విమానాశ్రయం పరిధిలో ఏదైనా ఘటన జరిగితే ఎన్ఐఏ తోనే విచారణ జరిపించాలనే నిబంధన స్పష్టంగా ఉంది. అందుకనే కోర్టు కూడా ఎన్ఐఏతో విచారణ చేయిస్తున్నది.

తీరా ఎన్ఐఏ విచారణ మొదలైన తర్వాత ఇపుడు చంద్రబాబు గగ్గోలు పెట్టటంలో అర్ధమేంటి ? హత్యాయత్నం కేసు వివరాలను స్టేట్ పోలీసులు అసలు ఎన్ఐఏకి ఇవ్వను కూడా లేదు. అందుకనే వివరాల కోసం, నిందితుడు శ్రీనివాస్ ను విచారణ నిమ్మితం అదుపులోకి తీసుకునేందుకు ఎన్ఐఏ కోర్టులో పిటీషన్ వేసి మరీ సాధించుకున్నది. అంటే శ్రీనివాస్ ను ఎన్ఐఏ విచారణ చేస్తే హత్యాయత్నం కేసులో కుట్ర వెనుక సూత్రదారులు బయటపడతారని చంద్రబాబు భయపడుతున్నారా ? అదే నిజమైతే కుట్ర కోణంలో సూత్రదారులెవరు ? టిడిపిలోని కీలక వ్యక్తులకు ప్రమేయం లేకపోతే చంద్రబాబుకు అంత ఉలికిపాటెందుకు ? ఈ విషయాలకు సమాధానాలు రావాలంటే నాలుగు రోజులు ఆగితే చాలు అన్నీ విషయాలు బయటకు వస్తాయి. మీరేమంటారా ?