ఆంధ్రలో ఆరోగ్యశ్రీ బంద్…వైఎస్ పై కోపమే కారణమా ?

 వ్యవస్ధలు, పథకాలను బాగు చేయటం, బ్రహ్మాండంగా నడిపించటం చేతకాకపోయినా నాశనం  చేయటం మాత్రం చంద్రబాబు బాగా చేసేస్తారు. తాజాగా వేలాదిమంది రోగుల ప్రాణాలు కాపాడిన ఆరోగ్యశ్రీ పథకాన్ని పడకేసేట్లు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కింది. రూ 500 కోట్ల బకాయిలు చెల్లించకపోవటంతో ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ పథకాన్ని ఈ రోజు నుండి  నిలిపేశాయి.

వైఎస్ ప్రారంభించిన ఈ పథకం అప్పట్లో బ్రహ్మాండంగా నడిచింది. కొన్ని వేలమంది నిరుపేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించిన ఘనత ఈ పథకానికి దక్కుతుంది. మధ్య తరగతి కుటుంబాల్లోని రోగులు కూడా కార్పొరేట్ వైద్యం చేయించుకునేందుకు భయపడే రోజుల్లోనే నిరుపేదలకు 5 స్టార్ స్ధాయిలోని కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఆపరేషన్లు చేయించుకునే అవకాశం కల్పించారు వైఎస్.

 

2009లో వైఎస్ రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారంటే అందుకు ఉపయోపడిన అనేక సంక్షేమ పథకాల్లో ఆరోగ్య శ్రీ ది కీలక పాత్రగానే చెప్పుకోవాలి. వైఎస్ హయాంలో ఈ పథకంలో వైద్యం అందలేదని చెప్పుకున్న ఘటనలు చాలా తక్కవనే చెప్పాలి. అటువంటి పథకాన్ని వైఎస్ తర్వాత ముఖ్యమంత్రులైన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కూడా అవసరమైన నిధులిచ్చి కొనసాగించారు. ఎప్పుడైతే 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రయ్యారో అప్పటి నుండే ఈ పథకానికి చంద్రగ్రహణం పట్టింది.

 

ఆరోగ్యశ్రీ పథకమంటేనే అందరికీ వైఎస్ గుర్తుకు వస్తారు. దాన్ని తట్టుకోలేని చంద్రబాబు పథకాన్ని ఎలాగైనా గబ్బు పట్టించాలని నిర్ణయించుకున్నారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ ప్లేసులో ఎన్టీయార్ హెల్త్ స్కీం అంటూ మరొకటి తెచ్చారు. పోనీ తెచ్చిన వారు ఆరోగ్యశ్రీ పథకంలో కన్నా బాగా నడిపారా అంటి లేదు. పేరుకు మాత్రమే ఎన్టీయార్ అని పెట్టారు. మొత్తానికి అటు ఆరోగ్య శ్రీ లేదు ఇటు ఎన్టీయార్ పథకమూ లేదు. హోలు మొత్తం మీద పథకాన్ని గబ్బు పట్టించేశారు.

ఆరోగ్య శ్రీ పథకంలో 5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 3 లక్షల మంది పెన్షనర్లు ఉపయోగించుకుంటున్నారు. అంటే 8 లక్షల కుటుంబాల్లోని సుమారు 1.3 కోట్ల మందికి ఈ పథకం సేవలందిస్తోంది. అటువంటి పథకానికి కొద్ది నెలలుగా బకాయిలను చెల్లించటం నిలిపేశారు. ఎప్పుడైతే బకాయిలు రూ 500 కోట్లకు పేరుకుపోయిందో ప్రైవేటు ఆసుపత్రల యాజమాన్యాలు సేవలు అందించటం మానేశాయి. దాంతో పథకం దాదాపు పడకేసినట్లే.

బకాయిలు పేరుకుపోయిన విషయాన్ని పథకం సీఈవో డాక్టర్ ఎస్ సుబ్బారావు కూడా అంగీకరించారు. కాకపోతే విడతల వారీగా సమస్యలు పరిష్కరిస్తామని చెబుతున్నారు. ఈ పథకం అమలును నిలిపేస్తున్నట్లు ఆసుపత్రుల యాజమాన్యాలు చెప్పినా చంద్రబాబుకు చీమ కుట్టినట్లు కూడా లేదు. వైఎస్ మీద లేకపోతే వైఎస్ కొడుకు జగన్మోహన్ రెడ్డి మీద కోపాన్ని పథకం మీద చూపిస్తున్నట్లుగా ఉంది చంద్రబాబు ధోరణి.