క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని చంద్రబాబునాయుడు ఎందుకు పట్టుబడుతున్నారు ? ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నపుడు క్యాబినెట్ సమావేశం పెట్టి విధానపరమైన నిర్ణయాలు తీసుకోకూడదన్నది నిబంధన. నిబంధనలు తెలిసినా మరి చంద్రబాబు ఎందుకు పట్టుబడుతున్నారో మెల్లిగా విషయం అర్ధమవుతోంది. ఉపాధి హామీ పథకం తాలూకు దాదాపు రూ 2 వేల కోట్ల బిల్లులు ఆగిపోయయట.
ఉపాథి హామీ పనులంటేనే అదో పెద్ద మాయ. పనులు జరగకుండానే జరిగినట్లు బిల్లులు పెట్టుకుని అధికారపార్టీలోని కొందరు నేతలు కోట్ల రూపాయలను మేసేశారనే ఆరోపణలున్నాయి. దాని తాలూకు 2 వేల కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయట. ఆ బిల్లులను పాస్ చేయమని అడుగుతుంటే అధికారులు కోడ్ పేరు చెప్పి ఆపేశారట.
దానికితోడు పాస్ చేయాల్సిన బిల్లులన్నీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం దగ్గర స్క్రీనింగ్ లో ఉన్నాయి. సిఎస్ ఎటూ బిల్లులు పాస్ చేసి కాంట్రాక్టర్లకు ఇవ్వటానికి ఒప్పుకోరు. అందుకని క్యాబినెట్ పేరుతో పెండింగ్ బిల్లులన్నింటినీ పాస్ చేయించుకుంటే సిఎస్ ఆపలేరని చంద్రబాబు ప్లానట. అసలు ఆర్ధికపరమైన నిర్ణయాలు, విధానపరమైన నిర్ణయాలు తీసుకునేందుకు లేదని నిబంధనలు చెబుతున్నాయి.
నిబంధనలు ఇంత స్పష్టంగా చెబుతున్నా క్యాబినెట్ తీసుకునే నిర్ణయాలను సిఎస్ ఎలా ఆమోదిస్తారని చంద్రబాబు అనుకున్నారో అర్ధం కావటం లేదు. అసలే సిఎస్ గా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి ఎల్వీని చంద్రబాబు బాగా కెలికేశారు. హుందాగా ఉండాల్సిన చంద్రబాబు ఎల్వీని టార్గెట్ చేసుకుని చెత్త తనంతటా తానుగా నెత్తినేసుకున్నారు. చంద్రబాబు ఆలోచన సరే అసలింతకీ క్యాబినెట్ సమావేశం జరుగుతుందా ?