అదే ఎవరికీ అర్ధం కావటం లేదు. పోలింగ్ కు ముందు కానీ తర్వాత కానీ ఏలూరు పార్లమెంటు సీటుపై ఎవరూ పెద్దగా మాట్లాడుకోలేదు. కానీ హఠాత్తుగా ఏలూరులో గెలిచే పార్టీపై బెట్టింగుల జోరు పెరిగిపోతోంది. ఇక్కడ నుండి సిట్టింగ్ ఎంపి మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) పోటీ చేస్తే వైసిపి తరపున కోటగిరి శ్రీధర్ రంగంలో ఉన్నారు.
శ్రీధర్ ప్రత్యక్షరాజకీయాల్లోకే కాదు పోటీ చేయటం కూడా ఇదే మొదటిసారి. కానీ టిడిపి ఎంపి మాగంటి బాబు మాత్రం డక్కా మొక్కీలు తిన్న రాజకీయ నేత. పోయిన ఎన్నికల్లో ఈ జిల్లాలో వైసిపి తుడిచిపెట్టుకుపోయింది. అందుకనే ఎంపి సీటును టిడిపి చాలా తేలిగ్గా గెలుచుకోగలిగింది.
కానీ మొన్నటి ఎన్నికల్లో మాత్రం సీన్ రివర్సయినట్లు సమాచారం. పోయిన ఎన్నికల్లో ఏలూరు పార్లమెంటు పరిధిలోకి వచ్చే ఏలూరు, కైకలూరు, దెందులూరు, ఉంగుటూరు, చింతలపూడి, పోలవరం అసెంబ్లీల్లో టిడిపి గెలిచింది. ఒక్క నూజివీడులో మాత్రమే వైసిపి గెలిచింది. కానీ మొన్నటి ఎన్నికల్లో మాత్రం చాలా నియోజకవర్గాల్లో వైసిపి గెలుపు ఖాయమనే అంటున్నారు.
దెందులూరులో తాను ఓడిపోతున్నట్లు సిట్టింగ్ ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకరే చెప్పుకుంటున్నారట. పోలవరంలో తాజా మాజీ ఎంఎల్ఏ టిడిపిని దెబ్బ కొట్టారని టిడిపి నేతలే ఆరోపిస్తున్నారు. చింతలపూడి, కైకలూరు, ఏలూరులో వైసిపి గెలుపు ఖాయమంటున్నారు. ఇక నూజివీడులో మళ్ళీ వైసిపిదే గెలుపట. కాబట్టి కోటగిరి గెలుపుపై ఒక్కసారిగా బెట్టింగుల జోరు పెరిగిపోయింది. ఒక విధంగా టిడిపి సమీక్షల తర్వాతే వైసిపి అభ్యర్ది గెలుపుపై జోరు పెరిగిపోయిందట.