ఎన్టీఆర్ విగ్రహానికున్న విలువ అమరావతికి లేదా బాలయ్య

నందమూరి బాలకృష్ణ.. తెలుగు దేశం పార్టీలో అత్యంత కీలకమైన వ్యక్తి.  గత ఎన్నికల్లో ఎంతోమంది టీడీపీ హేమా హెమీలు చిత్తుగా ఓడినా హిందూపూర్ నుండి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచారు.   అది కూడా 2014 ఎన్నికలప్పుడు పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చినప్పటి కంటే ఎక్కువ మెజారిటీతో.  అంతలా ఆయన్ను ఆదరించారు హిందూపూర్ ప్రజలు.  పార్టీలో కూడా ఎన్టీఆర్ వారసుడనే బలం ఆయనకు పుష్కలంగా ఉంది.  రాజకీయంగా ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు రాజకీయపరమైన బాధ్యతలు కూడా ఎక్కువగానే ఉంటాయి.  కానీ బాలయ్య మాత్రం ఆ బాధ్యతలకు దూరంగా ఉంటున్నారు.  తన నియోజకవర్గం తప్ప మిగతావేవీ తన విషయాలు కాదన్నట్టు వ్యవరిస్తుంటారు.  ఇప్పుడే కాదు.. మొదటి నుండి ఆయన వ్యవహారశైలి అంతే.  
 
ప్రజెంట్ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పీక్స్ లో ఉంది.  అమరావతిని పూర్తిస్థాయి రాజధానిగా తొలగించి మూడు రాజధానులను ఏర్పాటు చేస్తోంది వైసీపీ ప్రభుత్వం.  గవర్నర్ ఆమోదంతో శాసన ప్రక్రియ ముగిసి పాలనా వ్యవస్థ విశాఖకు తరలిపోయే ఏర్పాట్లు జరుగుతున్నాయి.  చంద్రబాబు సహా టీడీపీలో ఉన్న లీడర్లు అందరూ ఈ అంశంలో ఎలా పోరాడాలి, ప్రజల్లో పరువు ఎలా నిలుపుకోవాలి అనే ఆవేశంలో ఉన్నారు.  ఒకరకంగా టీడీపీకి ఇది సంక్షోభ సమయం.  ఘోర పరాజయం వెనువెంటనే అమరావతి రద్దు.  ఇంత జరిగినా ఏమీ చేయలేని నిస్సహాయత.  నిజమైన నిబద్దులు ఈ క్లిష్ట పరిస్థితుల్లోనే పార్టీ కోసం సర్వశక్తులు ఒడ్డాలి.  చాలామంది అదే చేస్తున్నారు.  తమకు తోచిన రీతిలో నిరసన గళం వినిపిస్తున్నారు. 
 
కానీ బాలయ్య.. ఇంత జరుగుతున్నా కనీసం ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం వైఖరిని ఖండించలేదు.  బిల్లు ఆమోదం పొంది 24 గంటలు గడిచిపోయినా ఆయన నుండి కనీస స్పందన లేదు.  కానీ సినిమాల విషయంలో మాత్రం కొత్త ప్రాజెక్ట్ ఓకే చేసినట్టు అప్డేట్స్ వస్తున్నాయి.  అంతెందుకు.. మొన్నామధ్యన నెల్లూరు జిల్లా కావలిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించిన వివాదంలో బాలయ్య ఎంత చొరవ చూపారో అందరం చూశాం.  పూటకొకసారి పార్టీ శ్రేణులకు ఫోన్ చేసి అప్డేట్స్ కనుక్కుంటూ సూచనలు, సలహాలు ఇచ్చారు.  వీలైతే వ్యవహారాన్ని ఎంతవరకైనా తీసుకెళ్ళాలి అనే సంకేతాలిచ్చారు.  చివరికి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఫోన్ చేసి కొత్త విగ్రహం పెట్టిస్తామని హామీ ఇచ్చే వరకు శాంతించలేదు.  
 
కూల్చింది తన తండ్రి, పార్టీ వ్యవస్థాకుడి విగ్రహం కాబట్టి బాలయ్య విరుచుపడటంలో తప్పు లేదు.  అలా చేయాలి కూడ.  కానీ అమరావతికి భూములిచ్చిన వేల మంది రైతుల ఆశల సౌధాలు కూలిపోతుంటే స్పందించకపోవడం మాత్రం ముమ్మాటికీ భావ్యం కాదు.  అమరావతి రద్దు కావాడం, మూడు రాజధానుల బిల్లు ఆమోదం పొందటం అనేది రాజ్యాంగబద్దమేనా కాదా అనేది సెకండరీ.  కానీ తమ పార్టీని నమ్మి భూమిలిచ్చిన రైతులు కష్టాల్లో ఉంటే వారి తరపున నిలబడి, కలబడాల్సిన బాధ్యత ఆ పార్టీ ఎమ్మెల్యేగా ఆయనకు మిగతా వారికంటే రెట్టింపే ఉంది.  కానీ ఆయన మాత్రం బయటకురారు.  రైతుల తరపున ప్రభుత్వాన్ని నిలదీయరు.  న్యాయం చేసేరు చేయకపోయేరు.. కనీసం నేనున్నాను అంటూ ధైర్యం చెప్పలేకపోతున్నారు.  
 
తండ్రి విగ్రహానికి అవమానం జరిగిందని అంతలా చెలరేగిన ఆయన అమరావతికి అన్యాయం జరిగితే నిమ్మకు నీరెత్తినట్టు మౌనంగా ఉండటం చూస్తే విగ్రహానికున్న పాటి విలువ అమరావతికి లేదా, అంత చిన్న వివాదం ఆయన్ను కదిలించింది కానీ రైతుల సంక్షోభం కదిలించలేకపోయిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి జనంలో.  జనానికే కాదు టీడీపీ శ్రేణులది కూడా అదే బాధ.  బయటపడలేరు.  పార్టీలో కీలకమైన వ్యక్తిగా, ఒక ఎమ్మెల్యేగా ఎందుకు గట్టిగా స్పందించట్లేదని నిలదీయలేరు.  అలా చేస్తే ఇంటి రచ్చ వీధిలోకి వెళ్ళి ఉన్న కాస్త పరువు పోతుంది.  కానీ పవన్ కళ్యాణ్ పోరాడట్లేదని, పోట్లాడటంలేదని మాత్రం అనుకూల మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో తెగ బాధపడిపోతూ కర్తవ్యబోధ చేస్తుంటారు.  గురవింద గింజ తన నలుపు ఎరుగకపోవడం అంటే ఇదే.