వార్ వన్ సైడేనా ?

అవునంటున్నది చంద్రబాబునాయుడు మీడియా. ఇక్కడ గెలిచేది నారా లోకేష్ అని కూడా తేల్చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసిపి ఎన్ని చవకబారు ఎత్తులు వేసినా అవేవీ లోకేష్ ముందు ఫలించలేదట. సహజంగానే లోకేష్ గట్టి అభ్యర్ధి కాబట్టి వైసిపి వేసిన ఎత్తులన్నింటినీ టిడిపి చిత్తు చేసేసిందట. అంటే చంద్రబాబుకు కూడా లోకేష్ పై లేని విశ్వాసాన్ని చంద్రబాబు తోకపార్టీ మీడియా పెట్టుకోవటం ఆశ్చర్యంగానే ఉంది.

నిజానికి వైసిపి సిట్టింగ్ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ముందు నారావారి సుపుత్రుడు నారా లోకేష్ ఏ విధంగా కూడా సరిపోడు. మంగళగిరిని సరిగా పలకలేక మందలగిరి అని పలికిన ఘనుడు లోకేష్. పోలింగ్ తేదీని ఏప్రిల్ 9 అని, కౌటింగ్ మార్చి 23వ తేదీ అని చెప్పి నవ్వులపాలయ్యాడు. ఒకదశలో లోకేష్ ప్రచారం చేస్తే పడే ఓట్లు కూడా పడవనే టెన్షన్ టిడిపి నేతలను పట్టి కుదిపిసేంది. అలాంటి లోకేష్ ను చంద్రబాబు మీడియా ఆకాశానికెత్తేస్తోంది.

విచిత్రమేమిటంటే, ఆళ్ళ తన ప్రచారంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. పోటీలో ఉన్నది లోకేషే అయినా ఆళ్ళ ఆరోపణలు చేసింది, విమర్శలు చేసింది మాత్రం చంద్రబాబు లక్ష్యంగానే. ఎందుకంటే, లోకేష్ ను తన ప్రత్యర్ధిగా ఆళ్ళ లెక్కేచేయలేదు కాబట్టి. వాస్తవం ఇలాగుంటే లోకేష్ పై వైసిపి అసత్యాలను ప్రచారం చేసిందని చంద్రబాబు మీడియా చెప్పటం విచిత్రంగా ఉంది.

ఓట్లు అడగటానికి లోకేష్ వెళ్ళినపుడు జనాలే ఎక్కడికక్కడ నిలదీసింది వాస్తవం.  జనాల నుండి ఎదురైన వ్యతిరేకతను తట్టుకోలేక మధ్యలో రెండు రోజులు నియోజకవర్గం నుండి మాయమైపోయారు. మామూలుగా అయితే ఓట్లు పడవన్న ఉద్దేశంతో భారీ ఎత్తున డబ్బులు, మద్యం తో పాటు ఏసిలు, వాషింగ్ మెషీన్లను పంపిణీ చేసింది టిడిపినే. నిజంగానే వార్ ఒన్ సైడ్ అయితే, లోకేష్ కు బంపర్ మెజారిటీ వచ్చేట్లయితే మరి ప్రలోబాలకు గురిచేయాల్సిన అవసరం ఏమిటి ?