గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో ఫైర్ బ్రాండ్ గా పాపులరైన ఎంఎల్ఏ కొడాలి నాని ఓటమికి తెలుగుదేశంపార్టీ గట్టి వ్యూహమే రచిస్తోంది. నాని గడచిన మూడు ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించారు. మొదటి రెండుసార్లు టిడిపి తరపున గెలిచిన నాని పోయిన ఎన్నికల్లో మాత్రం వైసిపి తరపున గెలిచి ముచ్చటగా మూడోసారి గెలిచారు. వైసిపి తరపున గెలిచిన దగ్గర నుండి చంద్రబాబునాయుడుపై ఒంటికాలి మీద లేస్తు మంచి దూకుడు మీదున్నారు. మామూలుగా నాని మీడియా ముందుకు రాటానికి ఇష్టపడరు. కానీ వస్తే మాత్రం ప్రత్యర్ధులపై తనదైన స్టైల్లో సెటైర్లతో విరుచుకుపడుతుంటారు.
ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబునాయుడు కంట్లో నాని నలుసు లాగే తయారయ్యారు. ఎందుకంటే, ఎన్టీయార్ పార్టీ పెట్టిన దగ్గర నుండి కృష్ణా జిల్లాపై టిడిపిదే ఆధిపత్యం. కారణమేమిటంటే ఎన్టీయార్ ది కృష్ణా జిల్లా కావటమే. అందులోను గుడివాడ అసెంబ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్టీయార్ సొంతూరు నిమ్మకూరు గుడివాడ నియోజకవర్గంలోనే ఉంది. అందుకనే గడచిన తొమ్మిది ఎన్నికల్లో ఏడుసార్లు టిడిపినే గెలిచింది. అంతటి పట్టున్న నియోజకవర్గంలో వైసిపి తరపున నాని గెలవటం, తనను టార్గెట్ గా చేసుకుని నాని చెలరేగి పోతుండటాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు.
అందుకనే రాబోయే ఎన్నికల్లో నానిని ఎలాగైనా ఓడించాలని చంద్రబాబు మహా పట్టుదలగా ఉన్నారు. అందులో బాగంగానే అనేక మంది నేతల పేర్లను పరిశీలించి ఇద్దరి పేర్లను షార్ట్ లిస్ట్ చేశారు. మాజీ ఎంఎల్ఏ రావి వెంకటేశ్వరరావు, దేవినేని అవినాష్ లో ఒకరికి టిక్కెట్టు దక్కటం ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీళ్ళిద్దరిలో నానిని ధీటుగా ఎదుర్కొనే సత్తా ఉన్న వాళ్ళెవరూ అన్న విషయాన్ని చంద్రబాబు తేల్చుకోలేకపోతున్నారు. అందుకనే ఫీడ్ బ్యాక్ కోసం జిల్లాలోని నేతలతో మాట్లాడుతున్నారు.
ఒక విధంగా పై ఇద్దరు కూడా నానిని తట్టుకోవటం కష్టమనే అభిప్రాయం నేతల్లో కనబడుతోంది. ఎందుకంటే, రావి డబ్బులు ఖర్చు పెట్టటం దగ్గర వెనకాడుతారు. దేవినేని నియోజకవర్గానికి కొత్త. పైగా నానిలాంటి బలమైన ప్రత్యర్ధిని ఢీ కొట్టేంత సామర్ధ్యం ఉందని ఎవరూ అనుకోవటం లేదు. నాలుగున్నరేళ్ళ పాలనలో చంద్రబాబుపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత పేరుకుపోయిందన్నది వాస్తవం. ఇటువంటి నేపధ్యంలో నాని లాంటి ప్రత్యర్ధిని ఢీ కొట్టాలంటే ఎవరికైనా కష్టమే. మరి చంద్రబాబు ఎవరిని ఎంపిక చేస్తారో చూడాల్సిందే.