Mohanbabu : ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి అలాగే మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ తదితరులు భేటీ అయిన విషయం విదితమే. అలీ, పోసాని కృష్ణమురళి, ఆర్ నారాయణమూర్తి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.
పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినీ పరిశ్రమకు సంబంధించి తలెత్తిన అభిప్రాయ బేధాలు.. ఈ అంశాలపై ముఖ్యమంత్రితో భేటీ జరగడం, భేటీలో సానుకూల ఫలితం వచ్చిందంటూ అటు ప్రభుత్వం, ఇటు సినీ పరిశ్రమ ప్రముఖులు వ్యాఖ్యానించడం తెలిసిన విషయమే.
అయితే, సీనియర్ నటుడు మోహన్ బాబు ఈ భేటీకి ఎందుకు హాజరు కాలేదు.? ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎందుకు వెళ్ళలేదా.? వంటి ప్రశ్నలు తెరపైకొచ్చాయి. అంతలోనే మంత్రి పేర్ని నాని, మోహన్ బాబు ఇంటికి వెళ్ళారు. చిరంజీవి అండ్ టీమ్ జరిపిన చర్చల తాలూకు వివరాల్ని మంత్రి తనకు అప్ డేట్ చేశారంటూ విష్ణు ట్వీటేయడం వివాదాస్పదమయ్యింది. విష్ణు తీరుని పేర్ని నాని తప్పుపట్టారుకూడా. దాంతో, ట్వీట్ తొలగించాల్సి వచ్చింది.
ఇదిలా వుంటే, మంచు విష్ణు తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన విష్ణు, తన తండ్రి మోహన్‌బాబుకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందిందనీ, అయితే దాన్ని మోహన్‌బాబుకి చేరనీయకుండా కొందరు మధ్యలో ఆపేశారనీ చెప్పుకొచ్చారు.
నిజానికి, ఇది చాలా పెద్ద ఆరోపణ. ప్రభుత్వం కూడా ఈ విషయమై సీరియస్‌గా స్పందించాలి. అయినా, అలా అడ్డుకోవాల్సిన అవసరం ఎవరికి వుంది.? ‘నాకు ఆహ్వానం అందింది. ఇంకెవరికైనా ఆహ్వానం అందిందా.? లేదా.? అన్నది నాకు తెలియదు..’ అని చిరంజీవి అప్పట్లోనే స్పష్టత ఇచ్చేశారు. అంటే, ఎవరికి వారికి విడిగా ఆహ్వానాలు వెళ్ళాయని అనుకోవాలి.
మరి మంచు విష్ణు ఎవరి మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు.?