లోకేష్ ఎవరు.. జూనియర్ ఎన్టీయార్‌ని టీడీపీలోకి స్వాగతించడానికి.?

విషయం స్పష్టం.! లోకేష్ కోసమే జూనియర్ ఎన్టీయార్‌ని చంద్రబాబు రాజకీయాలకు దూరం పెట్టారు. అదే సమయంలో, సినీ రంగంలో తనకున్న పేరు ప్రఖ్యాతుల నేపథ్యంలో, రాజకీయాల వైపు చూసేందుకు జూనియర్ ఎన్టీయార్ కూడా మొహమాటపడుతున్నాడు.

సినిమాల్లో వుంటే, పెద్దగా విమర్శలుండవు. రాజకీయాల్లో అలా కాదు.! చిరంజీవి, పవన్ కళ్యాణ్.. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. చిరంజీవి సినిమాలు మానేసి రాజకీయాల్లోకి వెళ్ళి నానా తిట్లూ తిన్నారు. రాజకీయాలొదిలేసి, తిరిగి సినిమాల్లొకొచ్చి, ‘పరిశ్రమ పెద్ద’ అయిపోయారు. ఇలా వుంటుంది రాజకీయం అంటే.

సో, జూనియర్ ఎన్టీయార్ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయాల వైపు చూడకపోవచ్చు. కానీ, ఆయన్ని అలా వదిలేయడంలేదు టీడీపీ. టీడీపీనే కాదు, వైసీపీ కూడా జూనియర్ ఎన్టీయార్‌ని రాజకీయాల్లోకి లాగుతోంది. టీడీపీ కంటే ఎక్కువ అత్యుత్సాహం వైసీపీలోనే కనిపిస్తోంది. జూనియర్ ఎన్టీయార్‌కి టీడీపీ పగ్గాలు ఇచ్చేయాలని వల్లభనేని వంశీ, కొడాలి నాని, లక్ష్మీ పార్వతి తదితర వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ టీడీపీని జూనియర్ ఎన్టీయార్ స్వాధీనం చేసుకుంటే, సోకాల్డ్ వైసీపీ నేతలు, టీడీపీలోకి వచ్చేస్తారా.?

ఆ సంగతి పక్కన పెడితే, ‘జూనియర్ ఎన్టీయార్‌ని 100 శాతం టీడీపీలోకి ఆహ్వానిస్తా..’ అని ఇటీవల ఓ ప్రశ్నకు బదులిచ్చారు లోకేష్. ‘అసలు లోకేష్ ఎవరు, ఎన్టీయార్‌ని టీడీపీలోకి ఆహ్వానించడానికి.?’ అన్న ప్రశ్న తెరపైకొచ్చింది. ఔను, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఆయన ఆహ్వానిస్తే తప్పేముంది.?