ఏపికి నామాలు పెడుతున్నదెవరు ? లోకేష్ అతి తెలివి

చినబాబు నారా లోకేష్ వ్యవహారం రాను రాను విచిత్రంగా తయారవుతోంది. వైసిపిని ఏదో ఒక విధంగా నవ్వులపాలు చేయాలన్న ఉద్దేశ్యంతో ఏదో ఒకటి ట్వీట్ చేస్తున్న లోకేష్ చివరకు తానే నవ్వులపాలవుతున్నారు. ఎలాగూ మంత్రి కూడా కాబట్టి ఏం మాట్లాడినా చెల్లుబాటైపోతుందని అనుకుంటున్నారు. మొన్న చేసిన ఓ ట్వీట్ తో లోకేష్ ఆలోచనలేంటో అందరికీ అర్ధమైపోతోంది. రాజీనామాల డ్రామాలతో వైసిపి ఎంపిలు ఏపి జనాలకు నామాలు పెట్టారంటూ లోకేష్ ఓ ట్వీట్ చేశారులేండి. ఇక్కడే లోకేష్ అతి తెలివేంటో బయటపడింది.


ప్రత్యేకహోదా డిమాండ్ తో వైసిపికి చెందిన ఆరుగురు లోక్ సభ సభ్యులు మొన్న ఏప్రిల్ 6వ తేదీన రాజీనామాలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. తర్వాత అదే డిమాండ్ తో ఢిల్లీలోని ఏపి భవన్లో నిరాహార దీక్ష కూడా చేశారు. సరే కారణాలు ఏవైనా వారి రాజీనామాలను జూన్ 4వ తేదీన కానీ లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించలేదు. తమ రాజీనామాలను వెంటనే ఆమోదించాలని వైసిపి ఎంపిలు ఎంత డిమాండ్ చేసినా ఉపయోగం లేకపోయింది.

ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన సందర్భంగా వైసిపి ఎంపిల రాజీనామాల అంశం చర్చకు వచ్చింది. ఎంపిల రాజీనామాలు ఆమోదం పొందే నాటికి సాధారణ ఎన్నికలకు ఏడాది గడువు మాత్రమే ఉంది కాబట్టి ఉపఎన్నికలు అవసరం లేదని చీఫ్ ఎలక్షన్ కమీషనర్ ఓం ప్రకాశ్ రావత్ స్పష్టంగా చెప్పారు. ఆ విషయం మీదే లోకేష్ ట్వీట్ చేశారు. మధ్యలో ఎన్నికలు రావని తెలిసి, కేంద్రంతో రాజీపడ్డారంటూ ఎద్దేవా చేశారు.

ఆంధ్రా ప్రజలకు నామం పెడుతూ వైకాపా వేసిన రాజీనామా డ్రామా బట్టబయలైందని ఎద్దేవా చేశారు. ఆంధ్రా ప్రజలను కేంద్రానికి తాకట్టు పెట్టాలని జగన్ మోడి రెడ్డి ప్రయత్నించారంటూ ఎగతాళి చేశారు. ఇక్కడ లోకేష్ తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. పాలకులు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టగలరే కానీ ప్రజలను తాకట్టు పెట్టలేరు. ఆ విషయం కూడా చినబాబుకు తెలీకపోవటం ఆశ్చర్యంగా ఉంది.

 

రాజీనామా డ్రామాలతో వైకాపా ఎంపిలు ఏపి ప్రజలకు నామాలు పెట్టారని చినబాబు ఆరోపిస్తున్నారు. ప్రతిపక్షంలోని ఎంపిలు జనాలకు ఏ విధంగా నామాలు పెట్టగలరు ? జనాలకు నామాలు పెట్టే అవకాశం అధికారపార్టీకే కదా ఉండేది ? పోనీ వైసిపి ఎంపిల రాజీనామాలు డ్రామాలే అనుకుందాం. వైకాపా ఎంపిల రాజీనామాలు చేయగానే ప్రధానమంత్రితో మాట్లాడి వెంటనే వైకాపా ఎంపిల రాజీనామాలను ఎందుకు ఆమోదం పొందేట్లు చంద్రబాబు చేయలేదు ? ఉపఎన్నికలను తెప్పించి మొత్తం ఐదు సీట్లను టిడిపినే గెలుచుకుని ఉండొచ్చు కదా ? చేతిలో ఉన్న అవకాశాలను నేలపాలు చేసుకుని ఇపుడు వైకాపా ఎంపిల డ్రామాలంటూ ట్వీట్ చేయటం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని లోకేష్ గుర్తుంచుకోవాలి.