స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న చంద్రబాబుకు బెయిల్ దొరికితే ఓకే… కానీ, బెయిల్ రాని పక్షంలో పార్టీ ఫ్యూచర్ ఏమిటనేది హాట్ టాపిక్ గా మారింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసుతో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, పుంగనూరు అల్లర్ల ఘటనకు సంబంధించిన కేసులు కూడా రెడీగా ఉండటంతో ఈ టెన్షన్ మరింత పెరిగిందని తెలుస్తుంది.
ఈ సమయంలో బాబు ఇప్పట్లో బయటకు వచ్చే ఛాన్స్ లేకపోతే మరి పార్టీ పరిస్థితి ఏమిటీ.. ప్రచారం అయితే పవన్ తో నడిపించేయొచ్చు కానీ, తీసుకోవాల్సిన నిర్ణయాలు, అభ్యర్థుల ఎంపిక, ప్రచార కార్యక్రమాల ప్రణాళిక, ఆర్థిక సర్ధుబాట్లు మొదలైన విషయాల్లో కీలకంగా, వ్యూహాత్మకంగా వ్యవహరించాలంటే కచ్చితంగా బాబు తప్ప అందుకు మరో ప్రత్యామ్న్యాయం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
అయినా కూడా తప్పదు కాబట్టి బాలకృష్ణ పేరు ఒకటి రెండు రోజులు హడావిడి చేసింది. ఆయన కూడా మీటింగులూ గట్రా పెట్ట్ కాస్త హడావిడి చేశారు. అయితే టీడీపీని నందమూరి వారసుల చేతిలో పెట్టడం చంద్రబాబుకు ఏమాత్రం ఇష్టం లేదని అంటున్నారు. దీంతో… బాలకృష్ణ ను సైడ్ చేసే పనిలో పడింది వారి అనుకూల మీడియా. గ్రూపు ఫోటోల్లో కూడా బాలయ్య ఫోటోను హైడ్ చేసి ప్రచురిస్తున్న పరిస్థితి!
ఇదే సమయంలో బాలయ్యకు కాస్త షార్ట్ టెంపర్ అని, ఎక్కడ ఎలా మాట్లాడాలనే విషయంలో కాస్త సృహ తక్కువనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో సెకండ్ ఆప్షన్ లోకేష్ అనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే… లోకేష్ కి అనుభవం సరిపోదని, ఇంకా మెచ్యూరిటీ రావాల్సి ఉందని కొంతమంది సీనియర్లు బలంగా నమ్ముతున్నారంట. దీంతో… లోకేష్ విషయంలో చంద్రబాబు మాట కోసం ఎదురుచూస్తున్నారని సమాచారం.
మరోపక్క ఈ సమయంలో బ్రాహ్మణి ఐతే బెటర్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆమెకు రాజకీయంగా అనుభవం లేకపోయినా.. అడ్మినిస్ట్రేషన్ లో మంచి పట్టు ఉందని, మాట తీరు కూడా బాగుందని, కాస్త సానబెడితే రాజకీయాల్లో రాణించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పలువురు టీడీపీ సీనియర్లు భావిస్తున్నారని సమాచారం. అయితే అందుకు లోకేష్ సైతం అంగీకరిస్తారా అనేది పెద్ద ప్రశ్న అనేవారూ లేకపోలేదు.
అయితే టీడీపీలో నారా, నందమూరి కాకుండా చాలా మంది సీనియర్లే ఉన్నారు. వీరిలో కొంతమంది స్వయంప్రకటిత మేధావులు కూడా ఉన్నారు. అయితే వారిని నమ్మి పార్టీని అప్పగిస్తారని అనుకోలేని పరిస్థితి. ఈ పార్టీ తన చేతికి ఎలా వచ్చిందో.. అలానే పోతుందేమో అనే భయం ప్రస్తుత అధినేతకు పుష్కలంగా ఉందని చెబుతున్నారు. సో… బాబు రావాలి – బాధ్యత తీసుకోవాలి. అప్పటివరకూ… ఈ చర్చ ఇలానే ఉంటుంది.. తమ్ముళ్ల సందిగ్గ్ధత కొనసాగుతుంది!