రంగంలోకి కెఏ పాల్ ను ఎవరు తెచ్చారు ?

విచిత్రమైన పరిస్ధితి ఏపి ఎన్నికల సమయంలో కనబడుతోంది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ ఎన్నికలు దగ్గరకు వచ్చే కొద్దీ స్పీడ్ అవుతున్నారు. అంటే పాల్ స్పీడవుతున్నారంటే ఎన్నికల కోసం రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేస్తున్నారని కాదు. తన పార్టీకి మాత్రమే ఓట్లేయాలని మీడియా సమావేశాల్లో మాట్లాడుతున్నారు. అదే సమయంలో క్రిస్తియన్ సంఘాలు, క్రిస్తియన్లు ఎక్కువగా ఉండే కూటములు, క్రిస్తియన్ ఓట్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల మీద ఎక్కువగా దృష్టి పెట్టి చాపకింద నీరులాగ అల్లుకుపోతున్నారు.

కెఏ పాల్ వల్ల ప్రధాన పార్టీలైన టిడిపి, వైసిపిలకు ఏదో నష్టం జరిగిపోతుందని కూడా ఎవరు అనుకోవటం లేదు. కాకపోతే పాల్ మాటలు విని ప్రజాశాంతి పార్టీకి పడే ఓట్లేవైనా ఉంటే పై రెండు పార్టీల్లో ఎవరికి నష్టం ? అన్నది అసలైన ప్రశ్న. క్రిస్తియన్ బ్యాకప్ టిడిపికి ఎప్పుడూ లేదు. పోయిన ఎన్నిల్లో క్రిస్తియన్ ఓట్లలో మెజారిటీ  ఓట్లు వైసిపికి పడ్డాయనే ప్రచారం బాగా జరుగుతోంది. కాబట్టి క్రిస్తియన్లు ఓట్లేయకపోయినా చంద్రబాబునాయుడుకు వచ్చే కొత్త నష్టమేమీ  లేదు. నష్టమేదైనా ఉంటే వైసిపికనే చెప్పాలి.

అదే సమయంలో పాల్ ను నమ్ముకుని ప్రజాశాంతి పార్టీకి పడే ఓట్లుంటాయని కూడా ఎవరు అనుకోవటం లేదు. మరి అలాంటపుడు పాల్ ఎందుకు చాపక్రింద నీరులాగ ప్రచారం చేసుకుంటున్నారు ? ఇక్కడే చాలామందిలో మెదులుతున్న సందేహం ఏమిటంటే, టిడిపిలో కీలక వ్యక్తులెవరో పాల్ ను హఠాత్తుగా రంగంలోకి దించారని. లేకపోతే రాష్ట్ర రాజకీయాల్లో నాలుగున్నరేళ్ళుగా కనబడని పాల్ ఇపుడే ఎందుకు హడావుడి చేస్తున్నట్లు ? వైసిపికి పడే పది ఓట్లలో కనీసం పాల్ ఓ మూడు ఓట్లు ఆపినా ఆమేరకు లాభపడేది టిడిపినే అన్నది స్పష్టం. కాబట్టి టిడిపినే పాల్ ను తెరపైకి తెచ్చిందనే ప్రచారం జరుగుతోంది. నిజమేంటో ఆ పై వాడికే తెలియాలి.