ఎక్కడ.? జనసేనాని ఎక్కడున్నారు.? ఏం చేస్తున్నారు.? మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న. ఓ ప్రెస్ నోట్, ఓ వీడియో బైట్.. ఇంతేనా.? జనసేనాని ఇంతకన్నా ఏమీ చేయలేరా.? చేయలేకనేం.. అడపా దడపా జనసేన కౌలు రైతు భరోసా యాత్ర చేస్తున్నారు.. జనవాణి.. అంటున్నారు. ఇవి కాక, పార్టీ ముఖ్య నేతలతో సమీక్షలూ నిర్వహిస్తున్నారు.
సరిపోతుందా.? వచ్చే ఎన్నికల్లో అధికార పీఠమెక్కడానికి జనసేనాని ప్రస్తుతం అనుసరిస్తున్న వ్యూహంతో అంతా ఓకేనా.? ఈ విషయమై జనసేన వర్గాల్లోనే చాలా నిరాశ వుంది. జనసైనికులు మాత్రం కింది స్థాయిలో చాలా చాలా కష్టపడుతన్నారు. వారి కష్టం చూస్తే, ఎవరికైనా జాలి కలగకమానదు.
సొంత ఖర్చులు పెట్టుకుని పార్టీ కోసం జనసైనికులు కష్టపడుతున్నారు. కొందరు కింది స్థాయి నాయకులదీ అదే పరిస్థితి. మరి, వారి కోసమైనా జనసేన పార్టీని ఒకింత అగ్రెసివ్‌గా జనసేనాని ముందుకు తీసుకెళ్ళాలి కదా.? పోనీ, సినిమాల్లో ఏమైనా పవన్ బిజీ అయిపోయారా.? అంటే, అదీ లేదు.
అసలు జనసేనాని అంచనాలేంటి 2024 ఎన్నికలకు సంబంధించి.? ఆ ఎన్నికల విషయమై జనసేనాని వ్యూహాలేంటి.? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియక జనసేన శ్రేణులు డీలాపడుతున్నాయి. ‘తరచూ ఏపీకి వస్తూ వుంటే.. పార్టీ ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ వుంటే.. ప్రజల్లో వుంటే.. మిగతాదంతా మేం చూసుకుంటాం..’ అని జనసేన కింది స్థాయి నేతలు, జనసైనికులు సూచిస్తున్నారు, భరోసా ఇస్తున్నారు జనసేనానికి.
‘దసరాలోపు ఏం మాట్లాడతారో మాట్లాడండి.. ఆ తర్వాత తేల్చేసుకుందాం..’ అంటూ మొన్నామధ్య జనసేనాని అధికార వైసీపీకి అల్టిమేటం జారీ చేశారు. దసరా వచ్చేస్తోంది.. జనసేనాని తదుపరి రాజకీయ వ్యూహమేంటో జనసేన పార్టీ శ్రేణులకే అర్థం కావడంలేదాయె.!