ఓడలు బళ్లు – బళ్లు ఓడలు… జూనియర్ దిక్కైన వేళ వాట్ నెక్స్ట్?

“నిషేధించిన రాయే తలకు మూలరాయి అవుతుంది”. అవును… ఎవరినైతే కాలదన్నుకుంటామో, తక్కువగా చూస్తామో.. ఒక్కోసారి వారే దిక్కవుతారు, వారు లేకపోతే దిక్కులేనివారవుతారు! అందుకే అన్నీ బాగున్నాయి కదా అనుకుని అయినవారిని దూరం చేసుకోకూడదని చెబుతుంటారు!

ఆ సంగతి అలా ఉంటే… స్కిల్ డెవలప్ మెంట్ స్కాం తర్వాత తెలుగుదేశం పార్టీ పరిస్థితి తుఫానులో చిక్కుకున్న నావలా మారిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. గాలి వానలో, వాన నీటిలో పడవ పరిస్థితిలా మారిందని అంటున్నారు. చంద్రబాబు లోపల ఉంటే ఏమైంది? బయట చినబాబు లోకేష్ ఉన్నాడు, నందమూరి నట సింహం బాలకృష్ణ ఉన్నారు కదా! అనుకునేటంత అమాయకపు పరిస్థితిలో టీడీపీ శ్రేణులు లేవని చెబుతున్నారు.

పైగా… బాలకృష్ణ పెద్దరికం, హుందాతనం ఏమిటనేది రెండు రోజుల అసెంబ్లీ సమావేశాల్లోనూ కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్న పరిస్థితి. మరోవైపు చినబాబుకి అంత మెచ్యూరిటీ లేదనేది సీనియర్ల నుంచి వినిపిస్తున్న మాట. పైగా ఏపీ ఫైబర్ నెట్ లో ఇవాళో, రేపో చినబాబుకి కూడా శ్రీకృష్ణజన్మ స్థల ప్రవేశం తప్పదనే కామెంట్లు వినిపిస్తున్నాయి! ఈ పరిస్థితుల్లో పార్టీ పరిస్థితి ఏమిటి? పార్టీకి దిక్కెవరు?

ఈ సమయంలో తమ్ముళ్ల నుంచి బలంగా వినిపిస్తున్న మాట… జూనియర్ ఎన్టీఆర్! వాస్తవానికి టీడీపీని స్థాపించింది సీనియర్‌ ఎన్టీఆర్‌ కాగా.. ఆయన తన సినీ గ్లామర్‌ తో, తనకున్న ఫాలోయింగ్ తో అతి తక్కువ కాలంలోనే ఏపీ రాజకీయాల్లో విజయవంతమైన నేతగా నిలిచారు. అయితే చంద్రబాబు ఆయన నుంచి పార్టీని లాక్కున్న అనంతరం తనదైన రాజకీయాలతో ఆయన ముందుకు నడిపిస్తూ వచ్చారు.

అయితే తాజాగా స్కిల్‌ స్కాం లో శుక్రవారం నాడు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. న్యాయస్థానం ఆయనకు మరో రెండు రోజులపాటు రిమాండ్‌ పొడిగించడంతో పాటు.. విచారణ నిమిత్తం సీఐడీ కస్టడీకి అనుమతించింది. మరోపక్క హైకోర్టులోనూ ఆయన తరఫున వేసిన క్వాష్‌ పిటిషన్‌ ను న్యాయస్థానం కొట్టివేసింది.

ఇదే సమయంలో అంగళ్లూ అల్లర్ల కేసు, ఏపీ ఫైబర్ నెట్ స్కాం కేసు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ఎలైన్మెంట్ లో మార్పులకు సంబంధించిన కేసూ వెంటాడుతున్నాయి. స్కిల్ డెవలప్ మెంట్ జస్ట్ తీగమాత్రమే.. డొంక చాలా ఉంది అని అధికారపార్టీ నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలతో చంద్రబాబు ఇప్పట్లో బయటికి వస్తారో లేదో అనే సందేహాలు శ్రేణుల్లో ఉన్నాయి!

ఈ సమయంలో బ్రాహ్మణికి పగ్గాలు అప్పగించినా.. అనుభవ లేమి, వాక్‌ పటిమ లోపం, రాజకీయాలపై సరైన అవగాహన లేకపోవడంతో పరిస్థితి మరీ ప్రమాదకరంగా మారతాదేమో అని సీనియర్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, ఆయన రాజకీయ వారసత్వం కంటే ముఖ్యంగా… ఈ సంక్లిష్ట సమయంలో టీడీపీని కాపాడుకోవడమే ప్రధానం అని ఆ పార్టీలో పలువురు నేతలు, అసలు సిసలు కార్యకర్తలు ఆలోచిస్తున్నారని తెలుస్తుంది.

ఈ పరిస్థితుల్లో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ టీడీపీకి పటిష్టమైన నాయకత్వం కావాలంటే జూనియర్‌ ఎన్టీఆర్‌ ని మించినవారు మరొకరులేరని కేడర్‌ భావిస్తున్నారు. నారా ఫ్యామిలీ అంటూ ఆలోచించి పార్టీని పూర్తిగా డ్యామేజ్‌ చేసుకోవడం కంటే నందమూరి సిసలు వారసుడు జూనియర్‌ కే పార్టీ పగ్గాలు అప్పగిస్తే కేడర్‌ లో ఉత్సాహం పొంగిపొర్లుతుందని బలంగా నమ్ముతున్నారు.

మరి ఇంతకాలం తనను అవమానించిన పార్టీ అని జూనియర్ ఆలోచిస్తారో.. లేక, తన ఆస్థి తనకు దక్కిందనే ఆలోచనతో అంగీకరిస్తారో వేచి చూడాలి. అసలు ఈ అభిప్రాయంపట్ల చంద్రబాబు అభిప్రాయం ఏమిటనేది మరింత ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో ఏమి జరగబోతుందనేది వేచి చూడాలి.