చంద్రబాబు సొంతూరులో ఏం జరుగుతోంది ?

చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరి నియోజకవర్గంలో ఏం జరుగుతోందో అర్దం కావటం లేదు. నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల కమీషన్ నిర్ణయించటంతో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. నియోజకవర్గంలో ఎలాగైనా గెలవాన్న ఉద్దేశ్యంతో టిడిపి పెద్ద ప్లానే వేసింది. దాని ప్రకారం సిట్టింగ్ వైసిపి ఎంఎల్ఏ చెవిరెడ్డి భాస్కరరెడ్డిని ఎక్కడికక్కడ అడ్డకుంటోంది.

పోలింగ్ రోజున పాకాల మండలంలోని ఐదు గ్రామాల్లోని దళితులు ఓటింగ్ హక్కును వినియోగించుకోలేకపోయారు. దళితులను ఓట్లు వేయనీయకుండా టిడిపి నేతలు అడుకున్నట్లు అప్పట్లోనే పెద్ద గొడవ జరిగింది. ఆ విషయం తెలిసి పోలింగ్ కేంద్రాలకు వెళ్ళిన చెవిరెడ్డికి టిడిపి నేతలకు పెద్ద గొడవైంది.

సరే పోలింగ్ ముగిసేదశలో కూడా పోలింగ్ కేంద్రాల్లో గొడవలయ్యాయి. దాంతో చెవిరెడ్డి ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో టిడిపి కూడా 20 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ కు ఫిర్యాదు చేసింది. అయితే జరిగిన గొడవలపై వైసిపి చేసిన ఫిర్యాదులో వీడియో సాక్ష్యాలు కూడా ఉండటంతో ఎన్నికల కమీషన్ ఐదుచోట్ల ఈనెల 19వ తేదీన రీ పోలింగ్ కు ఆదేశించింది.

అప్పటి నుండి టిడిపి నేతలు ఉడికిపోతున్నారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో గురువారం రాత్రి రీ పోలింగ్ జరుగుతున్న కేంద్రాల్లో ఒకటైన ఎన్ఆర్ కమ్మపల్లె లోని కొందరు దళితులపై దాడులు జరిగాయి. విషయం తెలిసి పరామర్శకు వెళ్ళిన చెవిరెడ్డిపైన కూడా దాడి జరిగింది. దాంతో ఉద్రిక్తలు పెరిగిపోయాయి. ప్రస్తుతం పోలీసుల క్యాంపు వల్ల గొడవలు తగ్గినట్లుగా అనిపిస్తోంది. కానీ పోలింగ్ రోజు ఏమవుతుందో అన్న భయం గ్రామస్తుల్లో పెరిగిపోతోంది.