టిడిపిలో ఏం జరుగుతోంది ? పెరిగిపోతున్న టెన్షన్

తెలుగుదేశంపార్టీలో ఏం జరుగుతోందో చాలామందికి అర్ధంకావటం లేదు. షెడ్యూల్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రజాప్రతినిధులు, కీలక నేతలు పార్టీకి రాజీనామాలు చేస్తుండటం ఆశ్చర్యంగా ఉంది. పైగా రాజీనామాలు చేసిన వారిలో అత్యధికులు వైసిపి కండువానే కప్పుకుంటున్నారు. ఇప్పటికి ముగ్గురు ఎంఎల్ఏలు, ఓ ఎంపి రాజీనామా చేశారు. త్వరలో మరింతమంది ఎంఎల్ఏలు, ఎంపిలు కూడా రాజీనామాల బాటలోనే ఉన్నారనే ప్రచారం పార్టీలో కలకలం రేపుతోంది.

ఎంఎల్ఏలు రావెల కిషోర్ బాబు, మేడా మల్లికార్జునరెడ్డి, ఆమంచి కృష్ణమోహన్ తో పాటు అనకాపల్లి ఎంపి అవంతి శ్రీనివాస్ రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. పై నలుగురిలో రావెల తప్ప మిగిలిన ముగ్గురు వైసిపిలోనే చేరారు. సరే ఈ విషయం ఇలా వుండగానే టిడిపి పెట్టినప్పటి నుండి పార్టీలోనే ఉన్న కీలక నేత దాసరి జై రమేష్ తాజాగా పార్టీకి రాజీనామా చేశారు. ఆయన కూడా తొందరలోనే వైసిపిలో చేరి విజయవాడ ఎంపిగా పోటీ చేస్తారట.

వచ్చేసిన వాళ్ళు కాకుండా తొందరలో మరింతమంది ఎంఎల్ఏలు, ఎంపిలు పార్టీకి రాజీనామాలు చేయబోతున్నట్లు విపరీతంగా ప్రచారమవుతోంది. అనంతపురం జిల్లాలో పుటపర్తి ఎంఎల్ఏ పల్లె రఘునాధరెడ్డి, తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురం ఎంఎల్ఏ తోట్ర త్రిమూర్తులు, అమలాపురం ఎంపి పండుల రవీంద్ర, కాకినాడ ఎంపి తోట నర్సింహం, ఉత్తరాంధ్రలోని ఇద్దరు ఎంఎల్ఏలు, రాయలసీమకు చెందిన ఓ పదిమంది ఎంఎల్ఏలు కూడా రాజీనామాలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దాంతో ఎప్పుడెవరు రాజీనామాలు చేస్తారో తెలీక అందరిలోను అయోమయం పెరిగిపోతోంది.

టిడిపికి రాజీనామాలు చేసి వైసిపిలో చేరాలని అనుకుంటున్న వారందరికీ జగన్ టికెట్లు హామీ ఇవ్వటం లేదట. అందుకనే కాస్త వెనకాముందు ఆలోచిస్తున్నారు. ముందు పార్టీలో చేరి ఎన్నికల్లో పనిచేయమని మాత్రమే జగన్ చెబుతున్నారట. గెలిచిన తర్వాత సముచితమైన పదవులు ఇస్తానని జగన్ హామీలిస్తున్నట్లు సమాచారం. మరి జగన్ మీద భరోసాతో వైసిపిలో చేరేవారెవరో ? వెనక్కు తగ్గేవారెవరో తొందరలోనే తేలిపోతుంది లేండి.