ఎన్నికల సంఘంతో మొదలైన వివాదంలో చంద్రబాబునాయుడుకు షాక్ తప్పేట్లు లేదు. ఇంటెలిజెన్స్ చీఫ్ ఏ బి వెంకటేశ్వరావుతో పాటు మరో ఇద్దరు ఎస్పీలను బదిలీ చేస్తు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇంటెలిజెన్స్ చీఫ్ ను ఈసి బదిలీ చేయటంతో చంద్రబాబుకు పెద్ద షాక్ తగిలింది. ఎలాగైనా ఏవి వెంకటేశ్వరరావు బదిలీని అడ్డుకుంటు ఏకంగా ఈసితోనే గొడవ పెట్టుకున్నారు. ఈసి పరిధిని, అధికారాలను ప్రశ్నిస్తు ఏకంగా కోర్టులో కేసే వేశారు.
ప్రస్తుత విషయానికి వస్తే ఇంటెలిజెన్స్ చీఫ్ బదిలీ ఈసి పరిధిలోకి రాదనే అడ్డుగోలు వాదన రేపు కోర్టులో వీగిపోనున్నట్లు సమాచారం. ఎన్నికల కమీషనర్ గోపాలకృష్ణ ద్వివేది ఇదే విషయమై మాట్లాడుతూ ఇంటెలిజేన్స్ తో సంబంధంలేని ఎన్నికలేముంటాయంటన్నారు. చీఫ్ సెక్రటరీ నుండి సాధారణ కానిస్టేబుల్ వరకూ ప్రతీ ఒక్కళ్ళు ఎన్నికల సమయంలో ఈసి పరిధిలోకి వచ్చేస్తారంటూ ద్వివేది స్పష్టంగా ప్రకటించారు.
ఇదే విషయాన్ని కోర్టు విచారణలో తమ వాదన వినిపిస్తామన్నారు. కేంద్ర ఎన్నికల కమీషన్ ప్రత్యేకంగా ఈ కేసును పర్యవేక్షిస్తున్నట్లు కూడా చెప్పటం గమనార్హం. ద్వివేది మాత్రమే కాకుండా ప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావు, అజేయ కల్లం కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో చీఫ్ సెక్రటరీ నుండి కానిస్టేబుల్ వరకూ ఎన్నికల కమీషన్ పరిధిలోకి వస్తారంటూ స్పష్టంగా చెప్పారు. గతంలో టిఎన్ శేషన్ సిఈసిగా ఉన్నపుడు తలెత్తిన వివాదంలో కూడా అప్పటి కోర్టు ఇదే విషయాన్ని చెప్పిందన్నారు. కాబట్టి వారి అభిప్రాయాలను బట్టి చంద్రబాబుకు తలబొప్పి కట్టక తప్పేట్లు లేదు.
సరే ఆ విషయాన్ని పక్కనపెడితే ఇంటెలిజెన్స్ చీఫ్ బదిలీ విషయంలో చంద్రబాబు పట్టుబడుతుండటంతోనే వాళ్ళిద్దరి మధ్య బంధం ఎంత గట్టిగా ఉందో అర్ధమైపోతోంది. ఆ బంధంపైనే వైసిపి నేతలు ఈసి ముందు ఆధారాలతో కూడిన ఫిర్యాదులు చేశారు. ఈసీ ఆదేశాలను బేఖాతరు చేయటమే కాకుండా ఈసి అధికారాలు, పరిధిపై ఏకంగా కోర్టులోనే చంద్రబాబు కేసు వేశారు. దాంతో ఈసీకి మండిపోతోంది. ఇప్పుడు గనుక చంద్రబాబు వాదనను తిప్పికొట్టకపోతే రేపటి రోజున ప్రతీ ముఖ్యమంత్రి ఇదే విధంగా ఈసి ఆదేశాలను అడ్డుకునే ప్రమాదం ఉంది.