తమ్ముళ్ల మాట… కూటమి గెలిస్తే వర్మకు రెండు బాధ్యతలంట!

ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ హాట్ టాపిక్ గా పిఠాపురం నియోజకవర్గం ఏ స్థాయిలో నిలిచిందో.. అదే స్థాయిలో స్థానిక టీడీపీ ఇన్ ఛార్జ్ ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ కుడా స్టేట్ వైడ్ ఫేమస్ అయిపోయిన సంగతి తెలిసిందే. అయితే గతకొన్ని రోజులుగా పవన్ గెలుపుపై తనదైన ధీమా వ్యక్తం చేస్తున్న వర్మకు కూటమి అధికారంలోకి వస్తే ఏ బాధ్యతలు ఇస్తారనేది అసక్తిగా మారింది.

అవును… తన సీటును జనసేన అధినేత పవన్ కు త్యాగం చేయడంతో పిఠాపురం వర్మ ఒక్కసారిగా స్టేట్ వైడ్ ఫిగర్ గా మారిపోయారు! ఎన్నికల వేళ ఆయన పేరు మారుమ్రోగిపోయింది. పైగా గతకొన్ని రోజులుగా పిఠాపురంలో పవన్ గెలుపుపై వర్మ పూర్తి ధీమాగా ఉన్నారు. ఈ విషయంలో యావదాస్తిని పందెం కాస్తాననే స్థాయికి ఆయన వెళ్లిపోయిన పరిస్థితి.

ఇక చంద్రబాబు విదేశాల నుంచి టూర్ ముగించుకుని ఉండవల్లి రాగానే ఆయన నివాసంలో వర్మ కలసి ముచ్చటించారు. తనకు పిఠాపురంలో అప్పగించిన బాధ్యతలను సక్సెస్ ఫుల్ గా నేరవేర్చినట్లు బాబుకు తెలిపారని అంటున్నారు. ఇదే సమయంలో పవన్ కు వచ్చే మెజారిటీపైనా తన అంచనాను బాబుకు చెప్పారని తెలుస్తుంది. దీంతో చంద్రబాబు.. వర్మను అభినందించారని అంటున్నారు.

దీంతో.. కూటమి అధికారంలోకి వస్తే పిఠాపురం వర్మకు చంద్రబాబు ఇచ్చే గిఫ్ట్ ఏంటి అన్నదే ఇపుడు ఆసక్తిగా మారింది. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే పిఠాపురం నుంచి పవన్ కచ్చితంగా మంత్రి అవుతారని అంటున్నారు. దీంతో ఆయన స్టేట్ వైడ్ పరిపాలనతో పాటు.. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల్లోని రాజకీయాన్ని చూసుకుంటారని అంటున్నారు.

ఈ పరిస్థితుల్లో వర్మ పొజిషన్ ఏమిటి అనే చర్చ తెరపైకి వచ్చిన నేపథ్యంలో… టక్కున చెబుతున్న మాట “ఎమ్మెల్సీ” అని. ఇటీవల ఫిరాయింపులకు పాల్పడ్డారనే కారణంతో వరసబెట్టి ముగ్గురు నలుగురు మీద అనర్హత వేటు వేసింది వైసీపీ! దీంతో కూటమి అధికారంలోకి రాగానే తొలి ప్రాధాన్యతగా వర్మకు ఎమ్మెల్సీ ఇస్తారు అని అంటున్నారు.

అంతకు మించి ఆయనకు ప్రభుత్వంలో ప్రాధాన్యత ఉండే అవకాశాలు లేవని అంటున్నారు. మరోపక్క… అటు రాజకీయాలు, ఇటు షూటింగ్ పెండింగ్ లో ఉన్న సినిమాల వల్ల పవన్ కల్యాణ్ ఫుల్ బిజీగా ఉంటారు కాబట్టి… పిఠాపురానికి ఇన్ ఛార్జ్ గా బాధ్యతలు కూడా వర్మకు కేటాయించే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే అందుకు జనసైనికులు అంగీకరిస్తారా అనేది మరో ప్రశ్న.

ఈ సమయంలో… పవన్ బిజీగా ఉంటారు కాబట్టి.. పిఠాపురం ఇన్ ఛార్జ్ గా బాధ్యతలు నాగబాబుకు ఇవ్వాలని పలువురు జనసైనికులు కోరుతున్నారని అంటున్నారు. వర్మ వర్గీయులు మాత్రం పవన్ ని భుజాన మోసి గెలిపించడంలో కృషి చేసిన వర్మకే పిఠాపురం ఇన్ ఛార్జ్ బాధ్యతలు ఇవ్వడం న్యాయం అని అంటున్నారు.

ఈ సమయంలో ఈ మాటకే చంద్రబాబు విలువిస్తే మాత్రం… వర్మకు అటు ఎమ్మెల్సీ బాధ్యతలతో పాటు పిఠాపురం ఇన్ ఛార్జ్ గా అదనపు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని అంటున్నారు. ఇదంతా పిఠాపురంలో పవన్ గెలవడం, కూటమి అధికారంలోకి రావడం వంటివి జరిగితేనే సుమా.!! అలా కానిపక్షంలో ఈ టాపిక్కే లేదు.. వర్మ ఊసే ఉండకపోవచ్చు!!