అభ్యర్ధులు, నేతలతో కర్నూలు జిల్లా సమీక్ష జరిగిన తర్వాత పార్టీ పరిస్ధితిపై అందరిలోను అయోమయం పెరిగిపోతోంది. మొన్నటి ఎన్నికలో పోటీ చేసిన అభ్యర్ధుల్లో చాలామంది పరస్పరం ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకోవటంతో చంద్రబాబుకు బుర్ర తిరిగిపోయింది. తమ గెలుపుకు సహకరించలేదని ఒక అభ్యర్ధి ఫిర్యాదు చేస్తే అభ్యర్ధే తమను కలుపుకుని వెళ్ళలేదని మరో నేత ఎదురు ఫిర్యాదు చేయటంతో సమీక్ష ఒక్కసారిగా వేడెక్కింది.
నేతల పరస్పర ఫిర్యాదులు, ఆరోపణలు శృతిమించటంతో చంద్రబాబు నేతల వాగ్వాదాలకు ఫులిస్టాప్ పెట్టారని సమాచారం. అభ్యర్ధుల గెలుపుకు కొందరు నేతలు ఉద్దేశ్యపూర్వకంగానే గండికొట్టారంటూ ఉపముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి, మంత్రి భూమా అఖిలప్రియ, ఎన్ఎండి ఫరూక్ తదిరులు పెద్ద ఎత్తునే చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. పార్టీ గెలుపుకు గండికొట్టిన వారి పేర్లను కూడా మంత్రులు బహిరంగంగానే చెప్పటంతో సమీక్షలో గందరగోళం రేగిందని సమాచారం.
ఒకవైపు తమ గెలుపుకు నేతలు గండి కొట్టారని అభ్యర్ధులే చెబుతున్నారు. మరోవైపేమో అభ్యర్ధులందరూ గెలుస్తున్నట్లు తాను చేయించిన సర్వేల్లో ఫీడ్ బ్యాక్ వచ్చిందంటూ చంద్రబాబు అందరినీ మభ్యపెట్టే ప్రయత్నం చేయటం విచిత్రంగా ఉంది. గెలుపోటములపై అభ్యర్ధులకన్నా చంద్రబాబు దగ్గర ఎక్కువ సమాచారం ఉండే అవకాశం లేదన్నది వాస్తవం. ఒటరు తీర్పు రిజర్వయిపోయిన తర్వాత కూడా చంద్రబాబు ఎందుకు అభ్యర్ధులను, నేతలను మభ్య పెడుతున్నారో అర్ధం కావటం లేదు.