పరిస్ధితి చూస్తుంటే అందరికీ అలాగే అనిపిస్తోంది. చంద్రబాబునాయుడు నిర్వహించిన సమీక్షల్లో పాల్గొన్న చాలామంది అభ్యర్ధుల భవిష్యత్తుపై స్పష్టమైన అంచనాకు వచ్చేశారు. చంద్రబాబు సమీక్షల వల్ల జరిగిన లాభం ఏమిటయ్యా అంటే ఎవరెవరు ఓడిపోతున్నారనే విషయం క్లారిటీ వచ్చేందుకే అన్నట్లుంది.
ముందుగా దెందులూరులో చింతమనేని ప్రభాకర్ విషయంలో స్పష్టత వచ్చింది. ఎందుకంటే తనకు వ్యతిరేకంగా సైలెంట్ ఓటింగ్ జరిగింది కాబట్టి తన గెలుపు కష్టమని స్వయంగా చింతమనేనే చెప్పుకున్నారు. కాస్త అటు ఇటుగా తెనాలి ఎంఎల్ఏ ఆలపాటి రాజేంద్రప్రసాద్ కూడా అలాగే చెప్పారట. తాజాగా మంత్రి పి. నారాయణ వంతు వచ్చింది.
మంత్రి తనకు సన్నిహితులతో మాట్లాడుతూ నెల్లూరు సిటీలో తన గెలుపు కష్టమని చెప్పారట. ఎందుకంటే తాను నమ్మినవారే తనను నట్టేట ముంచారని మంత్రి మండిపోతున్నారట. ఓటర్లకు పంచుతారని తాను నమ్మకస్తులన్న ఉద్దేశ్యంతో కొందరికి డబ్బులు అందచేస్తే వాళ్ళు కాస్త తమ వద్దే ఉంచేసుకున్నారంటూ మంత్రి భోరుమంటున్నారట.
తన కారులో తనతోనే తిరుగుతూ ఎన్నికలకు ముందు నుండి తనతోనే ఉంటు వాళ్ళ అవసరాలన్నీ తనతోనే తీర్చుకుని కూడా పోలింగ్ రోజున తనకు వ్యతిరేకంగా పనిచేశారంటూ మరికొందరిపై చంద్రబాబునాయుడుకు ఫిర్యాదు కూడా చేశారట. మొత్తానికి నారాయణ కూడా చేతులెత్తేసినట్లే ఉంది చూస్తుంటే.