చంద్రబాబుకు అంత క్రెడిబులిటీ ఉందా ?

నిజంగానే చంద్రబాబునాయుడుకు క్రెడిబులిటీ ఉందా ? ఇపుడిదే ప్రశ్న అందరిలోను మొదలయ్యింది. ఎందుకంటే తన  క్రెడిబులిటీని చూసే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టటానికి ఇన్వెస్టర్లు ముందుకొస్తున్నట్లు చంద్రబాబు తాజాగా శెలవిచ్చారు. పరిశ్రమలు, ఉద్యోగాల కల్పనపై విడుదల చేసిన శ్వేతపత్రంపై చంద్రబాబు మాట్లాడుతూ, కేంద్రం సహకరించకున్న తాను పెట్టుబడులను తీసుకొస్తున్నట్లు చెప్పారు. అయితే, ఇప్పటి వరకూ ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులుగా వచ్చాయో చెప్పమంటే మాత్రం చెప్పటం లేదు. ఎప్పుడు చెప్పినా ఇన్ని లక్షల కోట్లు, అన్ని లక్షల కోట్లకు అవగాహనా ఒప్పందాలు కుదిరినట్లు చెబుతున్నారే కానీ ఎన్ని లక్షల కోట్లు వచ్చాయన్నది మాత్రం చెప్పటం లేదు.

 

అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకూ నాలుగుసార్లు విశాఖపట్నంలో పెట్టుబడుల భాగస్వామ్య సదస్సులు నిర్వహించారు. అదే విధంగా పెట్టుబడులను ఆకర్షించటం అన్న పేరుతో దాదాపు 15 దేశాల్లో పర్యటనలు చేశారు. భాగస్వామ్య సదస్సుల ద్వారా పెట్టుబడులు ఎంత వచ్చాయి ? విదేశాల్లో తిరగటం వల్ల ఏ మేరకు పెట్టుబడులు వచ్చాయంటే మాత్రం ఎవరూ నోరిప్పరు. ప్రతీ భాగస్వామ్య సదస్సు వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై తక్కువలో తక్కువ రూ 30 కోట్లు ఖర్చవుతుంది.  భాగస్వామ్య పెట్టుబడుల సదస్సులో వచ్చిన పెట్టుబడులపై ఇఫుడు జనసేనలో ఉన్న నాదెండ్ల మనోహర్ రాష్ట్రప్రభుత్వంలోని పరిశ్రమల శాఖను సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలడిగారు. అందులో కూడా కుదిరిన అవగాహన ఒప్పందాల వివరాలే ఉన్నాయి కానీ వచ్చిన పెట్టుబడుల వివరాలు లేవు. అంటే పెట్టుబడులు పెద్దగా వచ్చినట్లు లేదు.

 

అదే విధంగా దేశం మొత్తం మీద ఏ రాష్ట్రంలో ఎన్ని పెట్టుబడులు వచ్చాయనే విషయంలో కేంద్రప్రభుత్వంలోని పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ విడుదల చేసిన బులెటిన్ లో కూడా ఏపి గురించి పెద్దగా వివరాలు లేవు. అంటే ఏపికి చెప్పుకోతగ్గ పెట్టుబడులు రాలేదనే అర్ధమవుతోంది. వాస్తవాలిలా ఉండగా చంద్రబాబు మాత్రం శ్వేతపత్రంలో బ్రహ్మాండమంటూ భుజాలు చరుచుకుంటున్నారు. నాలుగున్నరేళ్ళల్లో రూ 10.48 లక్షల కోట్ల విలువైన 2622 అవగాహనా ఒప్పందాలు కుదిరినట్లు చెప్పారంతే.  తాజా శ్వేతపత్రంలో కూడా 810 అవగాహనా ఒప్పందాలు కుదిరినట్లు చెప్పారే కానీ ఎన్ని కోట్లు వచ్చాయో చెప్పలేదు. పైగా తన క్రెడిబులిట వల్లే పెట్టబడులు పెట్టటానికి ఇన్వెస్టర్లు వస్తున్నట్లు బిల్డప్ ఒకటి.

 

భాగస్వామ్య సదస్సుల్లో టిడిపి మద్దతుదారులకే కోట్లు తొడిగటం,  కమీషన్లపై జీడిపప్పు అమ్ముకునే వాళ్ళను, రాజధాని జిల్లాల్లోని ఇంజనీరింగ్ కళాశాలల్లో కమీషన్లు తీసుకుని భర్తీ చేసేవాళ్ళను కూడా పెట్టుబడిదారులుగా ప్రచారం చేసుకుని ప్రభుత్వం పరువు పోగొట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ విషయాలను అడిగితే ప్రభుత్వం నుండి నోటమాటుండదు. వచ్చిన అరా కొరా పెట్టుబడులు కూడా చంద్రబాబునాయుడు సామాజికవర్గం వాళ్ళు పెట్టిందేనని, అదికూడా విలువైన భూముల కోసమే వచ్చారంటూ వైసిపి నేతలు ఆధారాలతతో సహా ఆరోపిస్తున్నారు. వైసిపి నేతల ఆరోపణలకు కూడా ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదు. ఇదే విషయమై మాజీ న్యాయమూరి శ్రవణ్ కుమార్ కోర్టులో కేసు కూడా వేయటం అందరికీ గుర్తుండే ఉంటుంది. సరే, ఆ కేసును హై కోర్టు టేకప్ చేయలేదనుకోండి అది వేరే సంగతి.