ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్నది. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలను యావత్ దేశం గమనిస్తున్నది.ఈ ఎన్నికలు రాష్ట్రంలో చంద్రబాబు, జగన్మోహన్‌రెడ్డి భవితవ్యాన్నే కాదు జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీ, రాహుల్‌గాంధీల ఎంపిక ను కుడా నిర్ణయించే అవకాశం కొంత ఉంది. చంద్రబాబుతో పాటు ,జగన్మోహన్‌రెడ్డికి ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యగానే ఉంటాయి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలోరెడ్డి కులస్తుడయిన జగన్మోహన్‌రెడ్డి ఒకవైపు,కమ్మ కులస్తుడయిన చంద్రబాబు మరోవైపు మోహరించి పోరాటం చేయవలసి ఉంటుంది. మధ్యలో కాపు కులస్తుడయిన జన సేనాని పవన్ కల్యాణ్ ఉంటారు.వీరు 13 జిల్లాల్లో నేరుగా రాజకీయాలు చేసే స్థితికి ఇంకా ఎదగలేదు.పవన్ కల్యాణ్ ఒంటరి పోరుకే ఇష్టపడుతున్నారు. తెలుగుదేశం– కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు ఉండే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి,కాని తాము సొంతంగానే పోటీ చేస్తున్నట్టు కాంగ్రెస్,తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
పేరుకు చతుర్ముఖ పోటీ ఉంటుంది కాని, రానున్న ఎన్నికలలో రాష్ట్రంలో ద్విముఖ పోటీనే జరుగుతుంది,ప్రధాన పోరు తెలుగుదేశం, వైసీపీ మధ్యనే ఉంటుంది.కుల బలం, ఆర్థిక బలాలలో ఈ రెండు పార్టీలకు సరితూగలేని పవన్ కల్యాణ్ ఎన్నికలలో కోంతనే ప్రభావం చూప వచ్చు. దీని వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి పోయే అవకాశం కుడా మెండుగానే ఉంటుంది.సిపిఎం,సిపిఐ లు ఒకటి రెండు శాతానికి పడి పోయాయి. ఇక్కడ బిజెపి నామ మాత్ర పార్టి.
అయితే ఈ సారి తెలుగుదేశం పార్టీ యూపీఏ కు మద్దతుగా కొత్త సమీకరణలతో రంగంలోకి దిగుతున్నది. చంద్రబాబు అధికారంలోకి వచ్చి కేంద్రంలో మళ్లీ నరేంద్ర మోదీ గద్దెనెక్కితే తిరిగి ఘర్షణ వాతావరణం కొనసాగవచ్చు. జగన్మోహన్‌రెడ్డి నరేంద్ర మోదీ మద్దతు పలికే గుంపులో ఉంటారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి సొంతంగా బలం లేనందున ఆ పార్టీ వారు వ్యూహాత్మకంగా జగన్మోహన్‌రెడ్డితో లోపాయికారీ అవగాహనకు వస్తారన్నది రాజకీయ పండితుల అభిప్రాయం.జగన్మోహన్‌రెడ్డి గెలిచి మోడీ మల్లి ప్రధాని అయినా రాష్ట్రానికి ఒరిగేది పెద్దగా ఉండక పోవచ్చు.ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు మోడికి అన్ని రకాలుగా సహకరించినా ఏమీ లబ్ది కలగలేదు..జగన్మోహన్‌రెడ్డి బీజేపీకి బహిరంగంగా మద్దతు ఇవ్వడానికి ఎన్నికలకు ముందు అంగీకరించక పోవచ్చు కానీ వారి మధ్య అలికిత,అప్రకటిత ఒప్పందం ఉంటుంది.
బీజేపీకి వ్యతిరేకంగా కోల్‌కతాలో మమతా బెనర్జీ నిర్వహించిన ర్యాలీకి ఆహ్వానం అందుకున్న చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్లి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్‌రెడ్డిని మిత్రుడిగా ప్రకటించారు. తెలంగాణా లో ఏపీలో జగన్ కు ఎక్కువ లోక్‌సభ స్థానాలు లభిస్తేనే జాతీయ స్థాయిలో తమ రాజకీయ ప్రయోజనాలు నెరవేరతాయి అన్నది వీరి ఆశ.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ప్రత్యక్ష పోరుకు కేసీఆర్ సిద్ధం అవుతున్నారు.ఇద్దరు చంద్రుల వైరంలో లాలుచి ఉందని , ఇది మహా రహస్య ఒప్పందంలో భాగం,అని కొందరు విశ్లేషకులు అంటున్నారు.ఎందుకంటే ఈ రెండు పాలక కులాల శత్రువు ఆ ఒక్క పాలక కులమే,అని వారు చెబుతున్నారు. జగన్మోహన్‌రెడ్డి తరఫున కేసీఆర్ ఏపీలో బహిరంగంగా ఎన్నికల ప్రచారం కుడా చేయ వచ్చు,చేయించ వచ్చు. జగన్మోహన్‌రెడ్డికి మద్దతుగా ఏపీ రాజకీయాలలో కేసీఆర్ పాల్గొంటే పరోక్షంగా చంద్రబాబుకు మేలు చేసిన వారవుతారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.తెలంగాణా మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ఆయన రంగంలోకి దించారు. ఏపీలో బీసీలను, ముఖ్యంగా యాదవులను చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆయన ప్రభావితం చేస్తారన్న వ్యాఖ్యానము వినిపించింది.కాని ఇందులో నిజం కోంతనే ఉండ వచ్చు.
బీసి కుల సమీకరణాల కోణంలో తెలంగాణ రాజకీయాలతో పోల్చితే ఏపీ రాజకీయాలు భిన్నంగా ఉంటాయి.ఏ.పి బీసీల్లో ఇఖ్యత తక్కువ. రాజకీయాల్లో బీసి ల ప్రభావం కుడా తక్కువ అని చెప్పవచ్చు. తెలంగాణతో పోల్చితే ఏపీలో కులాల సమాజం అంత సంక్లిష్టమైనది కాదు. ఏపీలో రెడ్లు,కమ్మ వారు, కాపు,రాజులు,వెలమల తర్వాత మాల వారు కొంత కట్టడిగా ఉంటారు.బీసీల్లో కట్టడి లేదు.రాజకీయాల్లో వారిది ఉత్ప్రేరక పాత్రనే. కళింగ ఆంద్రలో బీసిలుగా ఉన్న కాళింగులు,కొప్పుల వెలమలు,తూర్పు కాపులు సమ బలాలతో ఉన్నారు.
రెడ్డి నాయకులను, వోట్లను చీల్చడంలో చంద్రబాబు కొంత సఫలత సాదిస్తుండగా,కమ్మ నాయకులను వోట్లను చీల్చడంలో జగన్ కొంత వెనక బడినట్లు అనిపిస్తున్నది.
రాయల సీమ,కోస్తాన్ద్రలో ఉన్న కొద్ది మంది బీసీలు తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచీ అండగా ఉంటున్నారు. ఆ బీసీలలో చీలిక తేవడానికై కేసీఆర్ తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ప్రయోగించారు అని ఒక విశ్లేషణ, కాని తలసానికి తెలుగు దేశంలో ఒక ప్రధాన నాయకుడికి వియ్యంకుడు , యనమలతో కుడా భందుత్వముంది.ఆయనకు తెలుగు దేశం మాత్రు పార్టీయేనాయే. రాష్ట్రంలో తన ఏకాక ప్రత్యర్థిని ఓడించడానికి అన్ని అస్త్రాలతో పాటు సంక్షేమ అస్త్రాలకు చంద్రబాబు ప్రయోగిస్తున్నారు.
పొత్తుల వల్ల ప్రయోజనం ఉండకపోవచ్చునన్నది కాంగ్రెస్,తెలుగు దేశం పార్టీల వారి అభిప్రాయంగా ఉంది. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని రాహుల్‌గాంధీ ప్రకటించిన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ కొంత పుంజుకున్నట్టు ఉంది, నిజంగా కాంగ్రెస్ పుంజుకుంటే అది వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ వోట్లకే గండి కొడుతుంది,కాని తెలుదేశానికి నష్టం చేయదు.
చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాలతో పాటు పార్టీని కుడా పటిష్టం చేశాడు. ఇప్పుడు చంద్రబాబునాయుడు పార్టీ వ్యవహారాలపై మరింతగా దృష్టి నిలిపారు.23 జిల్లాల రాజకీయాలు నెరిపిన చంద్రబాబునాయుడుకు 13 జిల్లాల రాజకీయం నెరపడం పెద్ద కష్టం కానే కాదు.పైగా ఆయనకు కులం,మీడియా అండ పుష్కలంగా దొరుకుతుంది.డబ్బును సమీకరించే ఒడుపు,దానిని కింది వరకు పద్దతిగా పంచె నేర్పు ఆయనకుంది.అన్ని దేశాల్లో సంపన్నంగా సెటిల్ అయిన ఆయన కులస్తులు ఆయనకు అండగా ఉన్నట్లు,జగన్ కులస్తులు జగన్ కు సహకరించే పరిస్థితి లేదు.పైగా ఆయన ఒంటెద్దు పోకడ గల నాయకుడని కొనీ పుకార్లు షికారు చేయడం ఒక అశుభ సూచనగా కనిపిస్తున్నది.రెడ్డి నాయకులను, వోట్లను చీల్చడంలో చంద్రబాబు కొంత సఫలత సాదిస్తుండగా,కమ్మ నాయకులను వోట్లను చీల్చడంలో జగన్ కొంత వెనక బడినట్లు అనిపిస్తున్నది.కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి చంద్రబాబును కలవడం దీనికి ఒక సంకేతం అనుకోవచ్చు.జగన్కు పాదయాత్ర కుడా అనుకున్నంత వోట్లను రాల్చ లేక పోతుండ వచ్చని తెలుస్తున్నది.
ప్రధాని నరేంద్ర మోదీతో ఏర్పడిన విభేదాల కారణంగా రాహుల్ గాంధికి కాంగ్రెస్ పార్టీకి సన్నిహితమయ్యారు. కాంగ్రెస్‌తో అంటీముట్టనట్టు ఉంటున్న కొన్ని ప్రాంతీయ పార్టీలకు నచ్చజెప్పి కాంగ్రెస్‌తో కలిసి వేదికలు పంచుకునేలా చేశారు. దీంతో ఇంట గెలవాల్సిన అవసరం చంద్రబాబుకు ఏర్పడింది.
ప్రపంచంలో ని అన్ని దేశాలలో రాజకీయాలలో సంక్షేమమే ప్రధాన ఎన్నికల ఎజెండాగా మారిపోయింది. సంక్షేమ మంత్రంతో వోట్లను రాల్చుకోవాలన్నది రాజకీయాల్లో ప్రదాన సూత్రం అయ్యింది.దీని వలన వోట్లను రాల్చుకునే పరిస్థితి తెలుగు దేశానికే ఎక్కువ అనుకూలంగా ఉందని అనిపిస్తున్నది. జగన్మోహన్‌రెడ్డిని ఎదుర్కోవడానికై చంద్రబాబు సంక్షేమ మంత్రాన్ని పద్దతి ప్రకారం పారాయణం చేస్తున్నారు. అంద్ర కు నష్టం జరిగిందని బాబు దిల్లీలొ చేపట్ట బోయే దీక్ష కుడా వోట్ల పంట కోసమే.
బీసీలకు నేరుగా సహాయం చేయడంతో పాటు,, డ్వాక్రా మహిళలకు నగదు సహాయం సెల్‌ఫోన్లు కూడా ఇస్తానని ప్రకటించారు. తెలంగాణ తరహాలో రైతులకు ఎకరానికింత అని పెట్టుబడి సహాయం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు.ఎస్,సి లకు ఎస్టీలకు,మైనారిటీలకు పలు పతకాలు అమలు చేస్తూ, కొన్ని కొత్త పథకాలను ప్రకటించాడు. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చి తీరాలన్న పట్టుదలతోనే శక్తికి మించి సంక్షేమ పథకాల అమలుకు పూనుకున్నారు. దీంతో ఏపీలో రాజకీయ పోరులో ఇప్పటి కయితే చంద్రబాబు ముందు ఉన్నట్లు కనిపిస్తున్నారు. తండ్రి వారసత్వం,కులం,సీమ ప్రైడ్ ,పాద యాత్ర జగన్ కు అండగా ఉన్నాయి.పలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలిసిందే.
లోక్‌సభ ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయ పక్షాలు ఎన్‌డీఏ, యూపీఏ కూటమిలో ఎవరికీ ఎన్ని సీట్లు వస్తాయన్న దాని పై రెండు తెలుగు రాష్ట్రాల వారికి డిమాండ్ ఏర్పడుతుంది.డబ్బు,కులం,సంక్షేమ పథకాలు,వ్యూహ రచన, దాని అమలు.హామీల పట్ల ప్రజల నమ్మిక ఇవే ఏ.పి.ఎన్నికల్లో ప్రధాన అంశాలు కాబోతున్నాయి.
-దుర్గం రవిందర్,సీనియర్ జర్నలిస్టు, హైదరాబాద్