జూన్ 4న ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. జూన్ 1న ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి. ఈలోపు కొన్ని సర్వేలు తెరపైకి వస్తున్నాయి. అందులో ఫేక్ లు ఎన్ని, అసలు సిసలు ఒరిజినల్ ఎన్ని అనేది ఎవరికీ తెలియని పరిస్థితి! అయితే ఈలోపు గెలుపుపై అటు అధికార వైసీపీ, ఇటు విపక్ష కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో ఇప్పటికే జూన్ 9న విశాఖలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని వైసీపీ నేతలు చెబుతుండగా… అదే రోజు అమరావతిలో చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తారని తర్వాత టీడీపీ నేతలూ స్వరం కలిపారు. ఆ సంగతి అలా ఉంటే… ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి ఇచ్చే పోస్ట్ ఏమిటనే చర్చ తెరపైకి రావడం గమనార్హం.
అవును.. అల్లూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అనేది సామెత. అయితే… సర్వేల ఫలితాలు, ఎగ్జిట్ పోల్స్ విశ్లేషణలు తెరపైకి వస్తున్న సమయంలో ఆ సామెతను లైట్ తీసుకుంటున్నారు. సర్వేల ఫలితాలను పరిగణలోకి తీసుకుని ఎవరి ఆలోచనలు వారు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కూటమి అధికారంలోకి వస్తే జనసేన అధినేతకు ఏ పదవి ఇవ్వబోతున్నారనే చర్చ తెరపైకి వచ్చింది.
ఇందులో భాగంగా… పవన్ కల్యాణ్ ఒక్కడికే డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని పలువురు జనసైనికులు భావిస్తున్నారని అంటున్నారు. సీఎంగా చంద్రబాబు ఒక్కరే ఎలా ఉంటారో.. డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ ఒక్కరే ఉండాలని కోరుతున్నారని తెలుస్తుంది. మరోపక్క… పవన్ కల్యాణ్ కు హోమంత్రి పదవి ఇవ్వాలని మరికొంతమంది జనసైనికులు కోరుకుంటున్నారని చెబుతున్నారు.
అయితే టీడీపీ హయాంలో నిమ్మకాయల చినరాజప్ప హోమంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో… కింజరాపు అచ్చెన్నాయుడు, రఘురామ కృష్ణంరాజు, అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు, కొల్లు రవీంద్ర మొదలైన వారంతా ఆ పోస్ట్ కోసం ఎదురుచూస్తున్నారని తెలుస్తుంది. ఇదే క్రమంలో మరికొంతమంది నేతలు కూడా ఆ పోస్ట్ పై ఎన్నో ఆశలుపెట్టుకున్నారని తెలుస్తుంది.
మరి కూటమి అధికారంలోకి వస్తే పవన్ కల్యాణ్ కు డిప్యూటీ సీఎం ఇస్తారా.. లేక, హోంశాఖ ఇస్తారా.. అదీగాక, మరేమి ఇస్తారు అనేది వేచి చూడాలి. ఇలాంటి ఎన్ని ఆలోచనలు చేసినా జూన్ 4క్కి ముందు వరకే. ఆ తర్వాత ఎగ్జాట్ ఫలితాలు వస్తాయి.. అప్పుడు ప్రజాభిప్రాయం సుస్పష్టంగా తెరపైకి వస్తుంది.