పాతసీసాలో పాతసారా… కోరి కష్టాలు కొని తెచ్చుకున్న చంద్రబాబు!

నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా మైనారిటీ అంటూ జగన్ ప్రచారాలు చేస్తుంటే… నా బీజేపీ, నా జనసేన అంటూ చంద్రబాబు ప్రచారం చేస్తున్నారనే చర్చ తాజాగా ఏపీలో మొదలైంది. ప్రధానంగా ప్రతిపాదిత సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం)పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ముస్లిం మైనారిటీల ఓట్లు కూటమివైపు చూసే అవకాశం లేదని.. ఆ విషయంలో ముస్లిం లు చాలా స్ట్రిక్ట్ గానే ఉంటారనే చర్చ తెరపైకి వచ్చింది.

దీంతో… ముస్లింలు అత్యధికంగా ఉన్న సుమారు 60 నియోజకవర్గాల్లో బాబు & కో కోరి మరీ కష్టాలు కొనితెచ్చుకున్నట్లయ్యిందని అంటున్నారు. అవును… రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 60 నియోజకవర్గాల్లో ముస్లిం లు కీ రోల్ పోషించే అవకాశం ఉంది. వీరికి తోడు క్రీస్టియన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ ల ఓట్లు మెజారిటీగా కూటమికి పడే అవకాశం లేదని అంటున్నారు. ఇది కూటమికి భారీ దెబ్బ అని, బీజేపీతో పొత్తు వల్ల చంద్రబాబు కోరి తెచ్చుకున్న కొత్త కష్టం ఇదని చెబుతున్నారు.

ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చకూడదని.. అందుకోసం టీడీపీ – జనసేనలతో పాటు బీజేపీ కూడా జతకట్టాలని పవన్, బాబు కోరుకున్న సంగతి తెలిసిందే. అయితే… బీజేపీతో జతకట్టడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలికపైనే దృష్టి సారించారు కానీ… ముస్లిం మైనారిటీల ఓట్లు మొత్తం దూరం చేసుకుంటున్నామనే సృహ కోల్పోయారని అంటున్నారు పరిశీలకులు. 2014నాటి పరిస్థితులకు 2024నాటి పరిస్థితులకూ ఏమాత్రం పొంతనలేదనే విషయాన్ని గ్రహించడంలో ఈ ఇద్దరూ ఫెయిల్ అయ్యారని చెబుతున్నారు.

ఉదాహరణకు 2014 సమయంలో రాష్ట్ర విభజన జరిగింది. ఈ సమయంలో కొత్తగా ముఖ్యమంత్రి అయ్యే జగన్ కంటే… సీనియర్ అనిన చంద్రబాబే కరెక్ట్.. దానికి తోడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు వ్యతిరేకత ఏర్పడటంతోపాటు మోడీ మేనియా అని ఒకటి ట్రెండ్ అవుతున్న పరిస్థితి! దీంతో… పార్టీలకు అతీతంగా చాలా మంది కూటమికి మద్దతు పలికారు. బాబు – మోడీలను బాగా నమ్మారు. పవన్ పైనా నమ్మకం పెట్టుకున్నారు. అయితే ఆ నమ్మకాన్ని పూర్తిగా వమ్ముచేసుకునే పనులకు పాల్పడ్డారు ముగ్గురూ!!

దీంతో ఈ ముగ్గురు ప్రజలకు ఏమని చెప్పి కలిశారు.. రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనాలు కల్పించకుండానే ఎందుకు విడిపోయారు.. ఇప్పుడు మరళా ఏమి ఉద్దరించాలని కలిశారు.. తాజాగా చిలకలూరిపేటలో జరిగిన సభలో ఈ మేరకు ఏమి హామీలు ఇచ్చారు.. అలాంటప్పుడు ఎందుకు కలిశారు అనే చర్చ తెరపైకి వచ్చేసింది. దీనికి తోడు సీఏఏ తో బీజేపీపై ఉన్న వ్యతిరేకతను చంద్రబాబు, పవన్ లు కూడా పంచుకోవడానికి సిద్ధపడారని అంటున్నారు.

ఫలితంగా బీజేపీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు కోరి మరీ కొత్త కష్టాన్ని కొని తెచ్చుకున్నారని… బీజేపీకి కేటాయించిన ఆ పది సీట్లు జనసేనకే ఇచ్చి ఉంటే.. కనీసం ఆ పార్టీ కార్యకర్తల్లో అయినా కాస్త ఆగ్రహావేశాలు తగ్గి, పొత్తుకు ఎంతో కొంత ఫలితం ఉండేదని.. ఇప్పుడు అదీ పోయే, ఇదీ పోయే అన్నట్లుగా పరిస్థితి మారిపోయిందని అంటున్నారు పరిశీలకులు! మరి ఈ గండం నుంచి కూటమి ఎలా గట్టేక్కుతుందనేది వేచి చూడాలి!!